
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 7 : పెట్రోలు బంక్ నిర్వాహకులు గతంలో కల్తీలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తుండేవారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని గప్‌చుప్‌గా ముంచేస్తున్నారు. పోచంపల్లి పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ (పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్)లో కొంత కాలంగా వినియోగదారులకు తాము పోయించుకుంటున్న పెట్రోల్, డీజిల్‌లో కొలతల్లో తేడా వస్తుందని పలువురు వాపోగా, విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ మెట్రాలజీ సీఐ కిషన్ స్థానిక ఎస్ఐ సైదిరెడ్డితో కలిసి గురువారం ఆకస్మికంగా దాడి చేశారు. డీజిల్, పెట్రోలు రీడింగ్ పంప్లో ఒక చిప్‌ను అమర్చినట్లు వారు గుర్తించారు. ఈ మైక్రో చిప్ మూలాన కొలతల్లో 5 లీటర్లకు 150 ఎంఎల్ చొప్పున తక్కువగా రావడంతో వినియోగదారులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొంత కాలంగా ఇక్కడ ఈ వ్యవహారం నడుస్తున్నట్లు అధికారుల విచారణలో తేలడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు పంపులో లభించిన మైక్రో చిప్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఉన్నతాధికారుల సూచన మేరకు పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ సీఐ కిషన్ మాట్లాడుతూ ఈ బంక్ పై గతంలో పలు ఫిర్యాదులు అందాయని, దాని ఆధారం చేసుకొని తనిఖీలు నిర్వహించామన్నారు. ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లే ఇక్కడ బంక్ నిర్వాహకులు వినియోగదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. బంక్ పల్సర్‌లో చిప్ పెట్టడం వల్ల ప్రతి లీటర్‌కు 30 ఎంఎల్ చొప్పున తక్కువ వస్తుందని గుర్తించామని చెప్పారు. మోసానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు.
మునగాలలో బంక్ నిర్వాహకుడి అరెస్టు
మునగాల : పెట్రోల్ బంకుల్లో ఉన్న యంత్రాలలో మైక్రో చిప్‌లు అమర్చి వాహనదారులను బురిడీ కొట్టిస్తూ లక్షలు దండుకుంటున్న చిప్ చీటీగ్ అధికారుల తనిఖీలో బయట పడింది. దీంతో మునగాలలోని బంక్‌ను గురువారం సీజ్ చేసి లీజు దారుడుని అరెస్టు చేశారు. గతంలో పెట్రోల్ బంక్‌లో పనిచేసిన ఓ వ్యక్తి తన అనుభవం తో బంకుల్లో చిప్‌లను ఏర్పాటు చేసి మోసం చేయడంలో నైపుణ్యం సాధించాడు. తన అనుభవంతో బంకుల్లో మైక్రో చిప్‌లు ఏర్పాటుకు బంక్ నిర్వాహకులతో బేరం కుదుర్చుకొని చిప్‌లను ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడు. దీంతో రీడింగ్ చూపినప్పటికీ వాహన దారులకు తక్కువ పెట్రోల్, డీజిల్ వస్తుంది. మునగాల మండల కేంద్రలోని సందీప్ ఫిల్లింగ్ స్టేషన్ లీజు దారు సదరు వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని చిప్ ఏర్పాటు చేశాడు. చిప్ అమర్చిన వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు పట్టుబడగా అతడిచ్చిన సమాచారం మేరకు మునగాల సీఐ ఆంజనేయులు, తూనికలు కొలతల అధికారులతో కలిసి బుధ, గురువారాల్లో సందీప్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేసి చిప్ అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బంకులో తనిఖీలు నిర్వహించి జరుగుతున్న మోసాన్ని గుర్తించారు. చిప్ విషయం వెలుగులోకి రావడంతో బంక్ మేనేజర్ గోళ్ల నర్సింహారావుని అదుపులోకి తీసుకున్నారు. బంక్ సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో తూనికలు కొలతల అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, సేల్స్ మేనేజర్ సంతోశ్‌కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.