
ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జడ్జి ఎంవీ రమేశ్
రామగిరి, సెప్టెంబర్ 7: సత్వర న్యాయానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నెల 11న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో దీన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయసేవా అధికార సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ వెల్లడించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కోర్టులోని తన చాంబర్లో విలేకరుల సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.వేణుతో కలిసి ఆయన మాట్లాడారు. రాజీ యోగ్యమైన సివిల్, క్రిమినల్, భూ పరిహార, భూవివాద , బ్యాంకు రికవరీ కేసులు, చెక్‌బౌన్స్ ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీపడదగిన కేసులకు ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామమని, లోక్ అదాలత్‌లో తీర్పువస్తే తిరిగి అప్పీల్‌కు అవకాశం ఉండదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 1,500 రాజీపడదగిన కేసులు గుర్తించి నోటీసులు కూడా పంపించామని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.