
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఆకట్టుకున్న ప్రభల ఊరేగింపు
హుజూర్నగర్, సెప్టెంబర్ 5 : హుజూర్నగర్ పట్టణంలో ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ముత్యాలమ్మ జాతర కమిటీ సభ్యులు తొలి బోనం సమర్పించడంతో పండుగ ఆరంభమైంది. ఉదయం ముసలి ముత్యాలమ్మ తల్లికి మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. సాయంత్రం కులపెద్దలు బొడ్రాయి, కోట మైసమ్మ, కనకదుర్గమ్మలకు యాటలను బలిచ్చి, పూజలు చేశారు. మహిళలు బోనాలతో శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణం నలుమూలల నుంచి వేలసంఖ్యలో అలంకరించిన ప్రభలు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతలు సైతం అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్ రావు, పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, శీలం శ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.