
హుజూర్నగర్, సెప్టెంబర్ 3 : హుజూర్నగర్ పట్టణంలో ముత్యాలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగనున్నది. శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండుగకు చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది. నిర్ణీత తేదీకి మూడు రోజుల ముందుగా చల్లకూడును ఎత్తడంతో జాతర ప్రారంభమైనట్లే. ఆ తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా జాతర ఆగేది ఉండదు. ఊరు ఊరంతా 5 రోజులు జరిగే పండుగలో పాల్గొంటుంది. కుమ్మరి పూజారులు చల్లకూడు(చల్లగూడు)ను ఎత్తుకుని మేళతాళాలతో ప్రతి ఇంటికీ వెళ్తారు. గ్రామస్తులు ఉదయం పూట చల్లతో కలిపిన అన్నం తయారు చేసి కుమ్మరి పూజారులు తెచ్చిన కుండలో వేస్తా రు. ఈ చల్లకూడును పూజారులు అమ్మవార్లకు ఉదయం, సాయంత్రం నైవేద్యంగా పెడుతారు. చల్లకూడును పెట్టడం వల్ల గ్రామాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని నమ్మకం.
పండుగకు వారం ముందు…
జాతరకు వారం రోజులు ముందుగా వివిధ కులాల వారు తమ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లిస్తారు. గౌడ కులస్తులు కాటమయ్యకు, యాదవులు గంగమ్మకు, ముదిరాజ్లు పాండవులకు మొక్కులు చెల్లిస్తారు. అనంతరం బొడ్రాయికి, కోటమైసమ్మకు, కనకదుర్గమ్మ పాత గుడి వద్ద మేళతాళాలతో, నాట్యాలతో మేకపోతులను బలి ఇచ్చిన తర్వాత జాతర ప్రారంభం అవుతుంది.
తొలిరోజు…
పండుగ మొదటి రోజున జాతర కమిటీ తొలి బోనాన్ని సమర్పిస్తుంది. ఆ తర్వాత పెదకాపు, పెద్దకమ్మల యాటలను పోతురాజు వద్ద బలిస్తారు. దీంతో పండుగ ప్రారంభం అవుతుంది. అదేరోజు సాయంత్రం కులపెద్దలు బొడ్రాయి, కోట మైసమ్మ, కనకదుర్గమ్మ దేవతల ముందు యాటలను కోసి, పూజ చేస్తారు. ఆ తర్వాత గ్రామం నలుమూలల నుంచి ప్రభలు ప్రారంభమై అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. పండుగ రోజున ప్రభలను కట్టే ఆనవాయితీ నిజాం కాలం నుంచి కొనసాగుతుందని భక్తులు తెలిపారు. మహిళలు వేల సంఖ్యలో బోనాలను ఎత్తుకుని వచ్చి అమ్మవారి గుడి చుట్టూ తిరిగి సమర్పిస్తారు. గండదీపం నెత్తిన పెట్టుకుని బోనం ఎత్తుకుని నూతన దంపతులు అమ్మవారికి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని నమ్మకం బలంగా ఉంది.
ఆదివారం ప్రారంభమై 5 రోజులపాటు..
ఊరచెర్వు గట్టునున్న ముసలిముత్యాలమ్మ గుడిలో మొదటి రోజు ఆదివారం జాతర ప్రారంభం అవుతుంది. సోమవారం మూడు ముత్యాలమ్మలుగా పిలవబడే అంకమ్మ, మద్దిరావమ్మ, యలమంచమ్మకు మొక్కులు చెల్లిస్తారు. మిగిలిన మూడు రోజులు కనకదుర్గమ్మకు పూజలు చేస్తారు. దీంతో ఐదు రోజులపాటు సాగే జాతర ముగుస్తుంది.