
అజ్ఞానపు చీకట్లను తొలగించి, విజ్ఞాన వెలుగులు పంచే మహోన్నతులు గురువులు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన బోధనను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. చదువుపైనే గాక, సమాజంపైనా అవగాహన కల్పిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఆదివారం రాష్ట్రస్థాయిలో సత్కరించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. టీచర్స్ డే సందర్భంగా కొందరు ఉత్తమ గురువులపై నమస్తే
ప్రత్యేక కథనాలు..దేశ భవిష్యత్‌ను నిర్దేశించేది ఉపాధ్యాయులే..
ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించి తాను మాత్రం అదేస్థానంలో ఉంటూ ఆనందపడే వారే ఉపాధ్యాయులు. తరగతి గదిలో నేర్పిన పాఠాలే దేశ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. తల్లిదండ్రుల తరువాత కీర్తించబడుతున్నది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయుల దినోత్సవం రేపటి తరానికి చక్కటి
మార్గదర్శకం కావాలి. విద్య ద్వారానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గురుకులాలను
విస్తరించారు. తెలంగాణ విద్య తలమానికంగా నిలబడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
పలువురికి ఆదర్శం.. రాజిరెడ్డి
చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 4 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రేగట్టె రాజిరెడ్డి వృత్తిలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులకు చదవుతోపాటు ఇతర అంశాలను బోధిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవడంపై విద్యార్థుల పాత్రను గుర్తుచేస్తున్నారు. వాటిపై అనేక వ్యాసాలు రాసి కండ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. మొక్కలు నాటడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తాను పనిచేసిన ప్రతిచోటా మొక్కలను నాటించి సంరక్షణ చర్యలు చూస్తున్నారు. దీనికితోడు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా తన సొంత ఖర్చులతో పోస్ట్‌కార్డులు సమకూర్చి 23మంది విద్యార్థులతో హరితహారం ఆవశ్యకతను వివరిస్తూ వారి స్నేహితులకు బంధువులకు పోస్ట్ చేయించారు. 20ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించింది.
నేడు రాష్ట్రస్థాయి పురస్కారాలు తీసుకునే వారు వీరే…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉమ్మడి నల్లగొండలో వర్సిటీ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి సింగం శ్రీనివాస్, జూనియర్ అధ్యాపకుడు
(జువాలజీ), కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, నల్లగొండ
సుధీర్‌కుమార్, జూనియర్ అధ్యాపకుడు(మ్యాథ్స్), ప్రభుత్వ
జూనియర్ కళాశాల డిండి(గుండ్లపల్లి),
నల్లగొండ జిల్లా
వై.విక్రమ్‌బాబు, జూనియర్ అధ్యాపకుడు(జువాలజీ), ఎస్వీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వలిగొండ, యాదాద్రిభువనగిరి జిల్లా
కె.సైదయ్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శెల్గపూర్, తిరుమలగిరిసాగర్ మండలం విజ్ఞానాన్ని పంచుతూ.. మన్ననలు పొందుతున్న సైదులు
హాలియా : మండలంలోని శిల్గాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కట్టెబోయిన సైదులు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతూ.. గ్రామస్తులందరి మన్ననలను పొందాడు. 21 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సైదులు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిదేళ్లుగా శిల్గాపురంలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. గ్రామంలోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునేలా కృషిచేయడంతోపాటు దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఏటా 10మందికి పైగా విద్యార్థులకు గురుకులాల్లో సీటు వచ్చేలా సహకారం అందిస్తున్నారు. పెద్దవూర మండలం ఊట్లపల్లిలో మొదట ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన సైదులు 2009లో బదిలిపై అనుముల మండలం ఇబ్రహీంపేటకు వచ్చారు. 2013 నుంచి శిల్గాపురంలో పనిచేస్తున్నారు.
సులభ పద్ధతిలో సైన్స్ పాఠాలు నేర్పే మాస్టారు హరికృష్ణ
చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 4 : వృత్తినే గౌరవంగా భావిస్తూ.. అంకితభావంతో పనిచేస్తున్నారు చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు చింతల వెంకట హరికృష్ణ. ఫిజిక్స్ అంటే ఆమడదూరం వెళ్లే విద్యార్థులకు సులభపద్ధతిలో బోధిస్తూ ముందువరుసలో నిలుస్తున్నారు. బోధన పరికరాలను సొంత ఖర్చులతో సమకూర్చారు. వాటిద్వారా విద్యార్థులకు సులువుగా అర్థం చేసుకునే ప్రయోగాత్మక, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. 23 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాఠశాల ఆవరణలో పూల మొక్కలను నాటించి పర్యవేక్షిస్తున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలను అందిచడానికి కృషి చేస్తున్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
అధ్యాపకుడిగా.. సమాజ సేవకుడిగా..
2002 నుంచి సేవలందిస్తున్న సింగం శ్రీనివాస్
రామగిరి, సెప్టెంబర్ 4 : అధ్యాపకుడిగానే కాకుండా విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పిస్తూ ఓ వైపు తరగతి గది బోధన.. మరోవైపు ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవలందిస్తున్న అధ్యాపకుడు సింగం శ్రీనివాస్. ప్రస్తుతం నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపిక చేసింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కూనూర్ గ్రామానికి చెందిన సింగం పాపయ్య-జయమ్మ పెద్దకుమారుడు సింగం శ్రీనివాస్. 2002లో ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఎంపికై వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలోని నేరడుచర్ల, మిర్యాలగూడలో పనిచేసి నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూన్ 30, 2018లో బదిలీపై వచ్చారు. శ్రీనివాస్‌కు అవార్డు రావడం పట్ల డీఐఈఓ దస్రూ, కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నరేంద్రకుమార్, సీనియర్ అధ్యాపకులు వెంకటాద్రి కొండ ల్, సిబ్బంది అభినందనలు తెలిపారు.
అవార్డు మరింత బాధ్యతను పెంచింది
ప్రభుత్వం నా సేవలను గుర్తించి రాష్ర్టస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెంచింది. అవార్డును నా తల్లిదండ్రులు, విద్యార్థులకు అంకితం ఇస్తున్నాను.
23మందికి పీహెచ్డీ గైడ్షిప్ అందించిన ధర్మానాయక్
ఉమ్మడి జిల్లాలో 15ఏండ్లుగా విశేష సేవలు
రామగిరి, సెప్టెంబర్ 4 : ఉన్నత విద్యానిలయంగా పేదల యూనివర్సిటీగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చేరువ చేసిన వ్యక్తి డాక్టర్ బి.ధర్మానాయక్. 2007నుంచి నేటి వరకు ఉమ్మడి జిల్లాలో విశేషమైన సేవలందిస్తునారు. 23మంది విద్యార్థులకు ఎంబీఏఓ పీహెచ్డీ కోసం గైడ్షిప్ ఇచ్చి ఉత్తమపౌరులను సమాజానికి అందించారు. ఆయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడలోని బాలాజీనగర్. బీఆర్ఏఓయూ నుంచి రాష్ట్రంలో ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక వ్యక్తి కావడం విశేషం.
బానోతు లాల్నాయక్-బామినీబాయి ఆరో సంతానం ధర్మానాయక్. 15ఏండ్లుగా ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. నిరంతరం అధ్యాపకుల(కౌన్సిలర్స్)తో మమేకమై విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
పేద విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదుగాలి
ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్య చదివి ఉత్తమ పౌరులుగా స్థిరపడాలి. బీఆర్ఏఓయూ సేవలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలోనే నల్లగొండ అడ్మిషన్లలో ప్రథమ స్థానంలో నిలిచేలా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెంచింది. చేసే పనిని బట్టి గుర్తింపు వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సుధీర్ సర్ బోధనా తీరుకు ఓ లెక్కుంది..
డిండి, సెప్టెంబర్ 4 : మండల కేంద్రంలోని దొంతునేని నర్సింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఈటూరు సుధీర్‌కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 2018లో కూడా జిల్లా ఉత్తమ అధ్యాపకుడిగా ఆవార్డు అందుకున్నారు. 2002లో ఏపీపీఎస్సీద్వారా గణితశాస్త్ర అధ్యాపకుడిగా ఎంపికై మెదక్ జిల్లాలోని కంగ్పి జూనియర్ కళాశాలలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 19సంవత్సరాలుగా అంకితభావంతో వినూత్న పద్ధతుల్లో బోధన చేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. 2002నుంచి 2005వరకు కంగ్పి జూనియర్ కళాశాలలో, 2005నుంచి 2011వరకు డిండి జూనియర్ కళాశాలలో, 2011నుంచి 2018వరకు దేవరకొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేయగా, 2018నుంచి డిండి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. రెండు సార్లు ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2011లో డిండి జూనియర్ కళాశాలలో గణితంలో 100శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ఇంటర్ బోర్డు అధికారులు, అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్రావు చేతులమీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. విద్యార్థుల్లో సేవా దృక్పథం నింపేందుకు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) చైర్మన్‌గా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత, హరితహారంపై ప్రజలను చైతన్యపరిచారు.
రెటినైటీస్ పిగ్మెంట్టూజా వ్యాధితో క్రమంగా చూపును కోల్పోయినా
గణితంలో విద్యార్థుల అనుమానాలను బోర్డుపై రాసి వివరిస్తున్నారు.