చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని తండాలకూ నీరు
100 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు
పొగిళ్లలో ఇంటింటికీ కృష్ణా జలాలు
తాగునీటి గోస తీర్చిన మిషన్ భగీరథ
సీఎం కేసీఆర్ వల్లేనని సంబుర పడుతున్న గిరిజనులు
చందంపేట, సెప్టెంబర్ 3 : పొగిళ్ల.. నల్లగొండ జిల్లాకు చిట్ట చివరన విసిరేసినట్లుగా ఎత్తయిన గుట్టలపై ఉన్న గ్రామం. 180 గడపలు సుమారు 800 జనాభా ఉన్న గ్రామంలో ప్రజలకు గత ప్రభుత్వాల కాలంలో అన్నీ ఇబ్బందులే. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా గుక్కెడు నీటి కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వచ్చేది. చేదబావిలో తోడుకున్న ఫ్లోరైడ్ నీటితోనే గొంతు తడిసేది. గ్రామానికి ఆడ పిల్లను ఇవ్వాలంటేనే భయపడేవారు. తమ ఇంటి ఆడ బిడ్డ కష్టాలు తొలిగే రోజు కోసం గిరిజన తండాలు మొక్కని దేవుడే లేడు. వాళ్ల పూజలు ఫలించి మంచి రోజులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వారి కష్టాలను తీర్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా సుమారు 100కిలో మీటర్ల దూరంలో ఉన్న పొగిళ్ల గ్రామానికి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా సౌకర్యం కల్పించింది. వారి ఇంటి ముందే కృష్ణమ్మ నీటిని చూసి ఉప్పొంగిపోతున్నారు. కేసీఆర్ నీళ్లు
వచ్చాయని సంబురపడుతున్నారు.
47 గ్రామాలు, 80 ఆవాసాలకు భగీరథ నీరు
చందంపేట మండలంలోని 28 గ్రామాలు, 52 ఆవాస ప్రాంతాలు.. నేరెడుగొమ్ము మండలంలోని 19 గ్రామాలు, 28 ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. పొగిళ్ల, బండమీది తండా, నేరుట్ల తండా, చెవుటుట్ల, గువ్వల గుట్ట, వెంకట్ తండా, దాసర్లపల్లి, యాపలపాయ తండా, రేకులగడ్డ, బుడ్డోని తండా, చిత్రియాల, పెద్దమూల, నల్లచెలమూ ల, సుద్దబావి తండా, నల్లబావి తండా, బచ్చాపురం, గుంతల తండా, సర్కిల్ తండా, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులవలయం గ్రామాలన్నీ దేవరకొండ పట్టణానికి 60-70 కి.మీల దూరంలో ఉంటాయి. ఇవన్నీ గుట్టలపై ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర సర్కార్ భగీరథ ప్రయత్నం చేసి అన్ని గ్రామాలకూ తాగునీటిని అందిస్తున్నది. 60 సంవత్సరాలుగా పడిన తాగునీటి గోస తీరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి మర్రిగూడ.. ఎక్కడి పొగిళ్ల!
కృష్ణా నీటిని మిషన్ భగీరథ ద్వారా గడపగడపకూ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మర్రిగూడ మండలం వద్ద నీటి సంపును ఏర్పాటు చేసింది. అక్కడ నీటిని ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నది. పొగిళ్ల గ్రామానికి నీటిని తరలించాలంటే మర్రిగూడ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో పెండ్లిపాకల, గాగిళ్లాపురం, ఎల్లమ్మ గుట్ట వద్ద సంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి 40 కి.మీల దూరంలో ఉన్న పొగిళ్ల, కంబాలపల్లి, రేకులగడ్డ తదితర గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
తండావాసులు సంబరపడుతున్నరు
ఏ తండాలో చూసినా కేసీఆర్ నీళ్లను పట్టుకొని ప్రజలు సంబురపడుతున్నరు. గతంలో అనేక అవస్థలు పడ్డ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఇంతకు ముందు ఎప్పుడూ నీటి సమస్యపై సమావేశాల్లో చర్చకు వచ్చేవి. ఇప్పుడవేమీ రావడం లేదు.
మంచినీటికి ఇబ్బంది లేదు
మా తండాలో గతంలో ఒక్క బోరింగు కూడా లేకుండే. చాలా దూరాన వ్యవసాయ బోర్ల వద్దకు పోయి నీళ్లు తీసుకొచ్చే వాళ్లం. కొన్ని నెలల నుంచి ఆ బాధ తప్పింది. ఎప్పుడు నల్లా తిప్పితే అప్పుడు నీళ్లు వస్తున్నాయి. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
ఇంటి ముందే నల్లా పెట్టిండ్రు
గతంలో తాగునీరు లేక శానా ఇబ్బంది ఉండేది. నీటి కోసం రాత్రంతా నిద్ర పోయేటోళ్లం కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇంటి ముందే నల్లాలు పెట్టిండు. ఇలా ఇంటి ముందే నీటిని పట్టుకుంటానని ఎన్న డూ ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది.
అన్ని గ్రామాలకూ తాగు నీరు..
గుట్టల పైభాగంలో ఉన్న గ్రామాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా నీటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని అందిస్తున్నాం.