
టీఆర్ఎస్ గ్రామ కమిటీలకు శ్రీకారం
తొలి రోజు వందకుపైగా కార్యవర్గాల ఎన్నిక
ఏకాభిప్రాయానికే పెద్దపీటనేటి నుంచి
ఊపందుకోనున్న ప్రక్రియ
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం గ్రామ, వార్డు కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందకు పైగా కమిటీల ఎన్నిక పూర్తయ్యింది. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికలనూ ఏకకాలంలోనే పూర్తి చేస్తున్నారు. ఈ నెల 12 నాటికి క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలను పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో శనివారం నుంచి ప్రక్రియ మరింత ఊపందుకోనున్నది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల నేతృత్వంలో ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంతో పాటు ఢిల్లీలో పార్టీ కార్యాలయ భూమిపూజ సందర్భంగా గురువారం జెండా పండుగతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఇదే ఉత్సాహంతో శుక్రవారం నుంచి పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టారు. అయితే ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు హాజరైన ఎమ్మెల్యేలంతా ఇంకా జిల్లాకు చేరుకోని కారణంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల పరిధిలో కార్యవర్గాల ఎన్నిక ఇంకా ప్రారంభం కాలేదు. శని లేదా ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుంది. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంద గ్రామాలతో పాటు నాలుగు వార్డు కమిటీల ఎన్నిక పూర్తైనట్లు పార్టీ వర్గాల సమాచారం. అన్నిచోట్ల ఏకాభిప్రాయంతోనే కమిటీల ఎన్నిక పూర్తికావడం విశేషం.
కమిటీల ఇలా..
నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్ మండలాల్లో పలు గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఇక్కడ ప్రతిరోజు కొన్ని చొప్పున చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారంగా కనగల్ మండలంలో తొలిరోజు 17 గ్రామాలకు 14చోట్ల గ్రామ కమిటీల ఎన్నికను పూర్తి చేశారు. మొత్తం 31 గ్రామాలకు మిగతా గ్రామాల కమిటీల ఎన్నిక దశల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. నల్లగొండ మండలంలో మొత్తం 31 గ్రామాలకు తొలిరోజు 8చోట్ల కమిటీల ఎన్నిక పూర్తి చేశారు. తిప్పర్తిలో ఇంకా ప్రారంభించాల్సి ఉంది. అన్ని పూర్తయ్యాక ఇక్కడ అధికారికంగా కమిటీల వివరాలను ప్రకటించాలని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కమిటీల ప్రారంభం కాలేదు. వీటిల్లో కమిటీల ఎన్నికకు నేడు కొన్ని చోట్ల, రేపు మరికొన్ని చోట్ల శ్రీకారం చుట్టునున్నట్లు తెలిసింది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగుతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో కమిటీల ఎన్నికపై కసరత్తు పూర్తి చేశారు. ఇక్కడ కూడా శని లేదా ఆదివారం వరకు అన్ని మండలాల పరిధిలోని గ్రామ కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే హుజూర్నగర్ నియోజకవర్గంలో మెజార్టీ చోట్ల ప్రారంభం కాలేదు. నేరడుచర్ల మండలంలో 17 గ్రామాలకు గానూ మూడు చోట్ల పూర్తైంది. మేళ్లచెర్వు మండలంలో 14గ్రామాలకు గానూ రెండు చోట్ల ఎన్నికను పూర్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో తొలిరోజు కమిటీల ఎన్నికలపై ఎక్కడికక్కడే కసరత్తు చేసినా ఎన్నిక ప్రారంభం కాలేదు. శనివారం నుంచి వరుసగా అన్ని కమిటీల ఎన్నిక పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లోనూ తొలిరోజు కమిటీల ఎన్నిక మొదలుకాలేదు. ఆలేరు నియోజకవర్గంలో కొన్నిచోట్ల కమిటీల ఎన్నికను పూర్తి చేశారు. ముందే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారంగా ఈ కమిటీల స్థానిక నేతల పర్యవేక్షణలో కొనసాగింది.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ 4 వార్డులకు కమిటీల ఎన్ని క జరిగిం ది. గుట్ట మండలంలో 23 గ్రామాలకు గానూ రెండు గ్రామాలు, గుండాలలో 20 గ్రామాలకు నాలు గు, ఆలేరులో 14 గ్రామాలకు 6, మోటకొండూర్లో 18గ్రామాలకు రెండు, తుర్కపల్లిలో 31 గ్రా మాలకు ఆరు, ఆత్మకూర్(ఎం)లో 23గ్రామాలకు మూడు, బొమ్మలరామారంలో 10 గ్రామాలకు, రాజపేటలో 8 గ్రామాలకు పార్టీ కమిటీల ఎన్నికను పూర్తి చేశారు. ఈ నియోజకవర్గంలో మిగతా గ్రా మ, వార్డు కమిటీల ఎన్నికలను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేసేలా కార్యచరణ రూ పొందించారు. మెజార్టీ గ్రామాల్లో, వార్డుల్లో ఏకాభిప్రాయంతోనే కమిటీల ఎన్నిక పూర్తి కానున్న నేపధ్యంలో ఇచ్చిన గడువు కంటే ముందుగానే ఇవి పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.