
మునుగోడు నియోజకవర్గంలో
భారీ వర్షాలుగతంలో ఎన్నడూ లేనంత వర్షపాతం
పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
40ఏండ్లలో నిండని చెరువులూ మత్తడి దుంకుతున్న జలదృశ్యం
గణనీయంగా పెరుగుతున్న భూగర్భ జలాలు.. బోర్ల నుంచి
ఉబికివస్తున్న నీళ్లు
ఆశ్చర్యపోతున్న నియోజకవర్గ ప్రజలు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తగ్గనున్న పీపీఎం శాతం మునుగోడు నియోజకవర్గంలో దంచికొట్టిన వానలు ఉప్పొంగుతున్న వాగులు, అలుగు పోస్తున్న చెరువులు 40 ఏండ్లుగా ఇంతటి వాన చూడలేదంటున్న స్థానికులు జిల్లాలోనే అధిక వర్షపాతం.. పెరుగనున్న భూగర్భ జలాలు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాతాల్లోతగ్గనున్న పీపీఎం శాతం మునుగోడు నియోజకవర్గంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు గురువారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. గతంలో ఫ్లోరైడ్ మహమ్మారికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షిత జలాలు అందించేలా మిషన్ భగీరథకు పునాది వేయగా.. ఇలాంటి వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ శాతం తగ్గిపోయే అవకాశా లున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ జలాల రాకతో మనుషులు ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డప్పటికీ పశు పక్ష్యాదులు, పంటలపై ఆ ప్రభావం కొనసాగుతున్నది. వేసవిలో 10నుంచి 15 పీపీఎం నమోదయ్యే ఆ ప్రాంతంలో వానకాలంలో 6నుంచి 8శాతం ఉంటుంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఫ్లోరైడ్ శాతం మరింత తగ్గే అవకాశాలున్నాయి. భూగర్భ జల వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన 40ఏండ్లలో నిండని చెరువులూ ఈ సారి మత్తడి దుంకుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల్లో విస్తారంగా…
అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 54శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, చండూరులో 137.6శాతం, మర్రిగూడలో 101.4 శాతం, మునుగోడులో 82.8శాతం, నాంపల్లిలో 76.3శాతం రికార్డయ్యింది. గత నెల కంటే ఈ సారి ఆయా మండలాల్లో భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2020 ఆగస్టులో మునుగోడులో 6.19 మీటర్లలో భూగర్భ జలాలు ఉండగా ఈ ఏడాది 3.93మీటర్లలోనే ఉన్నాయి. ఇక ఫ్లోరైడ్‌కు కేరాఫ్ అయిన మర్రిగూడలో గతేడాది 19.43మీటర్లలో భూగర్భ జలాలు ఉండగా ప్రస్తుతం 8.50మీటర్లలోకి ఎగబాకడం వల్ల ఫ్లోరైడ్ శాతం ఒకటీ రెండు శాతంలోనే ఉండే అవకాశాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 304చెరువులు ఉంటే ఇటీవల కురుస్తున్న వర్షాలకు 108చెరువులు అలుగు పోస్తుండగా 40ఏండ్లుగా మత్తడి దుంకని చెరువులు సైతం ఈ సారి అలుగు పోస్తున్న జాబితాలో చోటుచేసుకోవడం గమనార్హం. హరితహారంలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏటా కోటిన్నర మొక్కలు నాటినట్లు అధికారులు వెల్లడించారు. దాంతో పచ్చదనం పెరిగిందని, అధిక వర్షాలకు అది కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
బోరు నుంచి ఉబుకుతున్న జలం
చండూరు : చండూరు మండలం లక్కినేని గూడెంలో వ్యవసాయ బోరు నుంచి నీళ్లు ఉబుకుతున్నాయి. గ్రామానికి చెందిన చొప్పరి లింగయ్య పొలంలో వేసిన బోరు నుంచి మోటర్ అవసరం లేకుండానే నీళ్లు బయటకు వస్తున్నాయి. ఊహించని ఈ పరిణామంపై లింగయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతటి వర్షాలను తాను ఏనాడూ చూడలేదని చెప్పాడు. మరో నాలుగేండ్ల పాటు నీళ్లకు ఢోకా లేదని అన్నాడు.