
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం షురూ అయ్యింది. అందుకు ఆరంభంగా గురువారం జిల్లావ్యాప్తంగా జెండా పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మారుమూల పల్లె వరకు పాలుపంచుకున్నది. అన్ని స్థాయిల్లోని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండా పండుగలో పాల్గొన్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో సంస్థాగత ఉత్సాహం కనిపించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు మున్సిపాలిటీల్లోని వార్డులు, మండలాలు, గ్రామాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎక్కడికక్కడే పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు జెండాను ఎగురవేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో స్థానిక కౌన్సిలర్ యామ కవితాదయాకర్తో పాటు ఇతర నేతలతో కలిసి శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిందాబాద్, అమరవీరులకు జోహార్లు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో పట్టణ అధ్యక్షుడు పిల్లిరామరాజు పార్టీ జెండా ఎగరవేయగా మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు, కౌన్సిలర్లు తరలివచ్చారు. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూర్, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులోనూ జెండా ఎగిరింది. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం జెండా ఎగురవేశారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని తండాల్లోనూ టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోనూ ఘనంగా జెండా పండుగ నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లోనూ జెండా దిమ్మెలు ఏర్పాటు చేసి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామాల్లోనూ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా జెండా పండుగలో కదం తొక్కాయి. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
నేటి నుంచే కమిటీల ఎన్నిక
నేటి నుంచి పార్టీ కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రత్యేకం గా ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఈ నెల 13 నుంచి మండల, పట్టణ కమిటీలకు ఎన్నికలు జరుగుతాయి. తర్వాత జిల్లా కార్యవర్గంతో జిల్లా స్థాయిలో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది.
దేశ రాజధానిలో జిల్లా నేతల సందడి
ఢిల్లీలో అంగరంగ వైభవంగా నిర్వహించిన తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నేతలంతా భాగస్వాములయ్యారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ముఖ్య నేతలంతా బుధవారం సాయంత్రానికే ఢిల్లీ చేరారు. గురువారం ఉదయం నుంచి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లోనూ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు పాలుపంచుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసి పార్టీ కార్యాలయ నిర్మాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్‌కుమార్, రవీంద్రకుమార్, ఎన్.భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, పార్టీ నేతలు నంద్యాల దయాకర్‌రెడ్డి, గుజ్జ యుగేంధర్‌రావు, టీఆర్ఎస్వీ నేత జిల్లా శంకర్ పాల్గొన్నారు.