
గరిడేపల్లిలో అత్యధికంగా 53.8మిల్లీ మీటర్ల వర్షపాతం
అత్యల్పంగా చిలుకూరులో 0.8 మిల్లీ మీటర్లు
లోతట్టు ప్రాంతాలు జలమయం
రాకపోకలకు తీవ్ర అంతరాయం
హుజూర్నగర్, సెప్టెంబర్ 1 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పలు గ్రామాల్లో ఇండ్లల్లోకి వరద చేరింది. గరిడేపల్లిలో అత్యధికంగా 53.8 మి.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా చిలుకూరులో 0.8 మి.మీటర్లు నమోదైంది. గడ్డిపల్లిలో 41.3 మి.మీ, పాలకవీడు మండలం అలింగాపురంలో 41.0, నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో 27.5, చివ్వెంల మండలం తిరుమలగిరిలో 25.8, పెన్‌పహాడ్‌లో 21.3, చీదెళ్లలో 18.5, నర్సయ్యగూడెంలో 18.0, బలరాంతండాలో 17.5, ఆత్మకూర్‌లో 15.3, మామిళ్లగూడెంలో 14.8, చందుపట్లలో 13.3, తుంగతుర్తిలో 12.3, కీతవారిగూడెంలో 11.8, తిరుమలగిరిలో 11.3, అర్వపల్లిలో 10.0, రెడ్డిగూడెంలో 9.8, మునగాలలో 8.8, నడిగూడెంలో 7.5, నాగారంలో 7.3, టేకుమట్లలో 6.5, శాంతినగర్‌లో 6.0, ఫణిగిరిలో 5.8, నూతనకల్‌లో 5.5, ఎల్కారంలో 5.0, ఉర్లగడ్డలో 2.5, దొండపాడులో 2.0, మేళ్లచెర్వులో 1.3, పెదవీడు, తొగర్రాయిలో 1.3, లక్కవరంలో, రఘునాథపాలెంలో 1.0, చిలుకూరులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నల్లగొండ జిల్లాలోని 22 మండలాల్లో
నల్లగొండ : జిల్లాలోని 22 మండలాల్లో బుధవారం వర్షం కురువగా సగటును 8.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. కేతేపల్లిలో అత్యధికంగా 40.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా మిర్యాలగూడలో 39.5 మి.మీ. కట్టంగూర్‌లో 33.7, దామరచర్లలో 31.1, అనుములలో 18.4, తిరుమలగిరి సాగర్‌లో 17.3, నిడమనూరులో 10.0, వేములపల్లిలో 9.2, నల్లగొండలో 8.0, మాడ్గులపల్లిలో 7.8, నార్కట్‌పల్లిలో 7.4, అడవిదేవులపల్లిలో 7.3, త్రిపురారంలో 6.4, తిప్పర్తిలో 4.1, శాలిగౌరారంలో 3.8, పెద్దవూరలో 3.2, చిట్యాలలో 1.4, నకిరేకల్‌లో 1.4, కనగల్‌లో 1.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మునుగోడులో 0.9, గుండ్లపల్లిలో 0.5, చండూర్, పీఏ పల్లిలో 0.1, మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో 372.2 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 557.4 మి.మీ. నమోదైంది.
మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల
కేతేపల్లి, సెప్టెంబర్ 1 : ఎగువ కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు బుధవారం నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 142.02 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 7615.43 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. కాలువలకు 7757.45 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు(4.46 టీఎంసీలు) ప్రస్తుతం 642.95 అడుగులు(3.92 టీఎంసీలు)గా ఉంది.
శాలిగౌరారం ప్రాజెక్టు @ 16.6అడుగులు
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తున్నది. బుధవారం నాటికి ప్రాజెక్టు నీటమట్టం 16.6అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇలానే కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21అడుగులు కాగా.. ఇప్పటికే వానకాలం పంటకు సాగునీరు విడుదల చేశారు. ఆయకట్టు కింద 6 వేల ఎకరాలు సాగులోకి రానుంది. సాగునీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నాల్ చెరువుకు గండి.. నీట మునిగిన పొలాలు
చివ్వెంల : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుడకుడ శివారులో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయం పరిసరాల్లోని కర్నాల్ చెరువు పూర్తిగా నిండింది. దీంతో చెరువు పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వెంచర్లోకి నీరు చేరింది. దీంతో వెంచర్ నిర్వాహకులు చెరువుకు గండి పెట్టారు. ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగిపోవడంతో బాధిత రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.