
ఉదయం 9 గంటలకు జెండావిష్కరణ
ప్రతి గ్రామం, పట్టణంలో ఏర్పాట్లు
రేపటి నుంచి గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక
మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఢిల్లీకి ముఖ్యులు
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ (నమస్తే తెలంగాణ) : గులాబీ జెండా పండుగకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. పార్టీ ఏర్పాటై ఇరవ య్యేండ్లు పూర్తయిన సందర్భంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి పునాది రాయి పడుతున్న సందర్భంగా గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్త య్యాయి. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునందుకున్న గులాబీ సైన్యం ఇందులో జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సాహంగా ఉరకలేస్తున్నది. ప్రత్యేకంగా అన్ని చోట్ల జెండా దిమ్మెలకు కొత్తగా రంగులు వేసి పార్టీ తోరణాలతో అలంకరించారు. గురువారం ఉదయం 9గంటలకు అన్నిచోట్ల ఓకేసారి పార్టీ జెండాలు ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంస్థాగత నిర్మాణం ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లే. మరోవైపు ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు, రాష్ట్ర పార్టీ నేతలు బుధవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో సంస్థాగత నిర్మాణ సందడి జోరందుకున్నది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ, అనుబంధ సంఘాల సంస్థాగత ఎన్నికలు షురూ కానున్నాయి. ఈ నెల మూడో వారం నాటికి జిల్లా కార్యవర్గం ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని రాష్ట్ర కార్యవర్గం ఎన్నికకు సిద్ధం కానున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలు, ఇన్చార్జీలు, పర్యవేక్షకులు ఇలా అంశాల వారీగా ప్రత్యేక బాధ్యులను నియమించారు. వీరు పర్యవేక్షించనున్నారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలను, పట్టణ ప్రాంతాల్లో వార్డు కమిటీల ఎన్నికను పూర్తి చేస్తారు. నేటి నుంచి 12వరకు దీనికోసం షెడ్యూల్‌ను ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొనేందుకు వెళ్లిన నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి నుంచి సంస్థాగత కమిటీల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.
జెండా పండుగకు ఏర్పాట్లు పూర్తి
పార్టీ అధినేత పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రతి గ్రామంలో, వార్డులో పార్టీకి క్యాడర్ ఉంది. దీంతో వీరంతా జెండా పండగలో భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిచోట్ల పార్టీ జెండా దిమ్మెలను ప్రత్యేకంగా అలంకరించారు. పార్టీ పిలుపు మేరకు గురువారం ఉదయం 9 గంటలకు అన్ని చోట్ల ఒకేసారి పార్టీ జెండా ఎగరవేయనున్నారు. అటు గ్రామాల్లోనూ, ఇటు పట్టణాల్లోని వార్డుల్లోనూ ఈ వేడుక జరగనుండడంతో గులాబీ జెండా రెపరెపలాడనుంది. జెండా పండుగ నిర్వహణపై పార్టీ నుంచి కూడా స్పష్టమైన సూచనలు ఉండటంతో సిద్ధంగా ఉన్నారు.
గ్రామ, వార్డు కమిటీ ఎన్నికల నిర్వహణ
జెండా పండుగ అనంతరం సంస్థాగత ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి నుంచి గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వీటిపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేశారు. ఈ సమావేశాల్లోనే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఇన్చార్జీలు, పర్యవేక్షకులను నియమిస్తున్నారు. వీరి నేతృత్వంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణ జరపాలని భావిస్తున్నారు. 12వ తేదీ లోపు క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించారు. ఆయా గ్రామాల జనాభాను బట్టి 15 నుంచి 25 మంది వరకు కమిటీలో సభ్యులుగా ఎన్నిక కానున్నారు. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను కూడా ఏకకాలంలో పూర్తి చేయనున్నారు. అయితే ఈ కమిటీల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి పెద్దపీట వేస్తామని, వీలైనంత వరకు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కోణంలో అడుగులు వేస్తున్నారు.
13 నుంచి మండల, జిల్లా కమిటీ ఎన్నిక
ఈ నెల 13నుంచి 20వరకు మండల, పట్టణ కార్యవర్గం ఎన్నికలను నిర్వహించనున్నారు. గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేశాక మండల కమిటీలపై దృష్టి పెట్టనున్నారు. అయితే మండల కార్యవర్గంతో పాటు పార్టీ అనుబంధ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. పట్టణాల్లోనూ పార్టీతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికను నిర్వహిస్తారు. ఇవి పూర్తయ్యాక ఈ నెల 20తర్వాత జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల ఎన్నికలను కూడా పూర్తి చేస్తారు. వీటన్నింటినీ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ నుంచి జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పర్యవేక్షించనున్నారు.
ప్రత్యేకంగా ఇన్చార్జీల నియామకం
సంస్థాగత ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రత్యేకంగా ఇన్చార్జీలను నియమించింది. నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు వై.వెంకటేశ్వర్లును, నాగార్జునసాగర్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సంస్థాగత నిర్మాణం పూర్తి చేయనున్నారు.
ఢిల్లీకి తరలివెళ్లిన నేతలు
ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలన్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు జిల్లా ముఖ్యులంతా ఢిల్లీ తరలివెళ్ళారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారధ్యంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుధవారం సాయంత్రం విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం జరిగే పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వీరంతా భాగస్వాములు కానున్నారు. శుక్రవారం సాయంత్రానికి తిరిగి జిల్లాకు చేరుకోనున్నారు.