
వానకాలం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆటంకాలను అధిగమించేందుకు ప్రత్యేక సమీక్షలుఎఫ్సీఐ, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ సమష్టి ప్రణాళిక దిగుమతి, ఎగుమతుల్లో ఇబ్బందుల్లేకుండా చర్యలు మొదట ఓపెన్ లాట్ల మిల్లింగ్ సెప్టెంబర్ నెలాఖరులోగా లక్ష్యం పూర్తి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేసి నూరు శాతం చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ రైస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోళ్లు, సీఎంఆర్
రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వానకాలం కొనుగోళ్లకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గత సీజన్లో నల్లగొండ జిల్లాలో 7.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం, ఆ మొత్తాన్ని వేగంగా సీఎంఆర్ చేసి ఎఫ్‌సీఐకి అప్పజెప్పేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నేతృత్వంలో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు, జిల్లా
రైస్‌మిల్లర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే
35 శాతం లక్ష్యం పూర్తయ్యి ఎప్పటి మాదిరిగానే రాష్ట్రంలో ముందుండగా, సెప్టెంబర్ నాటికి నూరు శాతం లక్ష్యం
పూర్తిచేయనున్నట్లు అధికార యంత్రాంగం చెప్తున్నది. మరోవైపు సూర్యాపేట జిల్లాలోనూ సీఎంఆర్ 8 శాతం పూర్తయ్యింది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో ఈ యాసంగిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 7.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేసింది. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీ ద్వారా 374 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరాయంగా కొనుగోళ్లు జరిపారు. 1,16,285 మంది రైతుల నుంచి రూ.1,480.70 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి గత నెలాఖరుకే చెల్లింపులు కూడా వందశాతం పూర్తి చేశారు. గత యాసంగిలో ఊహించని విధంగా ధాన్యం దిగుబడులు రావడంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు సరిపోలేదు. దీంతో మార్కెట్ యార్డుల్లోని గోదాములు, బహిరంగ ప్రదేశాల్లో లాట్స్ కట్టి కవర్లతో భద్రపరిచారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చే ప్రక్రియపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ సంబంధిత శాఖలతో పలుమార్లు దీనిపై ప్రత్యేక సమీక్ష చేశారు. అధికారుల లెక్కల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యం నుంచి మొత్తం 5.37లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని అంచనా. ఇప్పటివరకు 2.30లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ పూర్తి చేసిన అనంతరం ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 3.07లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ చేయాల్సి ఉందని గుర్తించారు.
నిత్యం 6వేల మెట్రిక్ టన్నులు..
జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించిన అనంతరం నిత్యం 6వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ వస్తాయని తేల్చారు. ఈ బియ్యాన్ని వెంటవెంటనే అక్కడి నుంచి ఎగుమతి చేయడంతో తదుపరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. అందుకే ఏ రోజుకు ఆ రోజే బియ్యాన్ని సీఎంఆర్ అనంతరం మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు పంపేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 70వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎఫ్‌సీఐ తీసుకుని బియ్యాన్ని దిగుమతి చేసుకునేలా చూడాలని నిర్ణయించారు. వీటితోపాటు ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఇతర రాష్ర్టాలకు బియ్యం ఎగుమతులు చేసేందుకు నెలకు 50 అదనపు ర్యాక్‌లు రప్పించేలా చర్యలు చేపడుతున్నారు.
ఓపెన్‌గా ఉన్న లాట్లకు ప్రాధాన్యం..
ఓపెన్‌గా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించి సీఎంఆర్ చేయాలని నిర్ణయించారు. రైస్‌మిల్లర్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నారు. ఎగుమతులు, దిగుమతుల సమయంలో హమాలీల కొరత లేకుండా చర్యలకు ఆదేశించారు. గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ రైస్ ఎఫ్‌సీఐ గోదాములలో స్టాక్ ఉంటే దాన్ని కూడా అదనపు ర్యాక్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఖాళీ చేసేలా చూడనున్నారు. వానకాలం దిగుబడులు వచ్చే సరికి సీఎంఆర్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఇలా..
సూర్యాపేట : జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ సేకరణ(సీఎంఆర్) గత వానకాలం లక్ష్యానికి చేరువలోకి వచ్చింది. ఇప్పటికే 80 శాతం పైగా బియ్యాన్ని సేకరించారు. ఈ ఏడాది సూర్యాపేట జిల్లాతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి ధాన్యం మిల్లింగ్ చేయడానికి సూర్యాపేట జిల్లాకు తీసుకువచ్చారు. దీంతో జిల్లాలోని 74 మిల్లులలో 3,05,148.920 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయనున్నారు. మిల్లింగ్ ద్వారా 2,06,920.121 మెట్రిక్ టన్నుల బియ్యం రానున్నది. ఇప్పటికే 1,65,900 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించి ఎఫ్సీఐకు తరలించారు. మిగిలిన ధాన్యం సెప్టెంబర్ చివరి నాటికి అందించాల్సి ఉంది. యాసంగి ధాన్యం సైతం మిల్లింగ్ ఇప్పటికే ప్రారంభించి 8 శాతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,58,756.080 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా మహబూబాబాద్ జిల్లా నుంచి 26,463 మెట్రిక్ టన్నులు, ములుగు నుంచి 19,929 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇక్కడే సీఎంఆర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల మొదటి వారం వరకు 80 శాతం మిల్లింగ్ ప్రక్రియ పూర్తి కాగా సుమారు 1,65,900మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించారు. మిగిలిన 41,020 మెట్రిక్ టన్నుల బియ్యం సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
యాసంగి ధాన్యం 8 శాతం..
ఈ ఏడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మిల్లింగ్ ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 8 శాతం మిల్లింగ్ పూర్తి చేసింది. యాసంగిలో జిల్లాలో 6,59,624.550 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ 72 మిల్లులో సాగనున్నది. వానకాలం మిల్లింగ్ పూర్తి చేసిన మిల్లులు యాసంగి ధాన్యం మిల్లింగ్ చేయడం ప్రారంభించాయి. 6,59,624.550 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 4,48,544.694 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వనున్నారు. దాదాపు 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి తరలించారు. సీఎంఆర్ వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలతో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతినాయక్ నిరంతరం మిల్లర్లతో మాట్లాడుతూ సీఎంఆర్ వేగంగా జరిగేలా చూస్తున్నారు.
సమన్వయంతో ముందుకు..
జిల్లా పౌరసరఫరాల శాఖతోపాటు ఎఫ్‌సీఐ, రైస్‌మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ సీఎంఆర్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. సీఎంఆర్‌పై మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించాం. రైస్‌మిల్లర్లు నిత్యం 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని వెంటనే గోదాములకు తరలించేలా ఎఫ్‌సీఐ అధికారులకు ఆదేశాలిచ్చాం. ఓపెన్ లాట్లలోని ధాన్యాన్ని ముందుగా సీఎంఆర్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. సెప్టెంబర్ చివరి నాటికి సీఎంఆర్ పూర్తయ్యేలా చూస్తాం. రెండేండ్లుగా సీఎంఆర్ పూర్తిలో జిల్లానే ముందుంది. – చంద్రశేఖర్, ఏజేసీ, నల్లగొండ
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రభుత్వం విధించిన గడువు లోపే జిల్లాలో సీఎంఆర్‌ను పూర్తి చేస్తాం. గడువులోగా అన్ని మిల్లులు వంద శాతం పూర్తి చేయాలి. కేవలం7-9 మిల్లులు మాత్రమే కాస్త వెనుకంజలో ఉన్నాయి. దాదాపు 37 మిల్లుల్లో 98-100 శాతం పూర్తి చేశాయి. మిగిలిన చోట వేగంగానే సీఎంఆర్ జరిగేలా ఎప్పటికప్పుడు మిల్లర్లతో మాట్లాడుతున్నాం. మిల్లింగ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలకు వెనుకాడం.
-రాంపతి నాయక్, సివిల్ సప్లయ్ డీఎం, సూర్యాపేట