
రైతు పండించిన పంటకు మద్దతు ధరను అందించడంతోపాటు ప్రతి గింజనూ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచే పక్కా కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఈ వానకాలం రైతులు సాగు
చేస్తున్న పంటల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించింది. యాసంగిలో అధికారులు పంట లెక్కలను సరిగ్గా తీయనందున అంచనాలకు మించి ఉత్పత్తులు వచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. రెవెన్యూ అధికారుల సహకారంతో ధరణి పోర్టల్‌లో ఉన్న భూముల ఆధారంగా ప్రతి సర్వే నంబరునూ సందర్శించి ఏయే పంటలు వేశారో సమగ్రంగా నమోదు చేయాలని సూచించడంతో వీఆర్ఏలు, ఏఈఓలు ఆ పనిలో పడ్డారు. పంట దిగుబడుల అమ్మకానికి రైతులు ఇబ్బందులు పడకుండా ఈ నివేదిక ఆధారంగా మార్కెటింగ్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. ఉమ్మడి జిల్లాలో వానకాలం సీజన్ 21.58 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 15.65 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం తెలిపింది.
నల్లగొండ, ఆగష్టు 11 : రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతోపాటు ఆ పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు సర్వే చేపడుతోంది. క్షేత్రస్థాయిలో ఏఈఓలు ప్రతి ఏటా సర్వే చేసి రైతుబంధు పోర్టల్‌లోని క్రాఫ్ బుకింగ్ సైట్లో పొందుపరుస్తున్నారు. అయితే రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్లపై పూర్తిస్థాయిలో వారికి అవగాహన లేనందున రైతులు చెప్పిందే సైట్లో పొందుపర్చేవారు. దీంతో పంట లెక్కలు వాస్తవికతకు దగ్గరగా లేనందున గడిచిన రెండేండ్లుగా సరిగా రావడం లేదు. దీంతో పంట ఉత్పత్తుల అంచనాలు తారుమారు అయ్యి అంచనాలకు మించి రావడంతో కొన్ని సందర్భాల్లో ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సర్కారు ప్రయాస పడాల్సిన పరిస్థితి. ఈసారి పంట లెక్కలను పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్‌లో ఉన్న భూముల ఆధారంగా సర్వే నంబర్ వారీగా వీఆర్వోను జత చేసి ఏఈఓలతో సర్వే చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 21.58లక్షల ఎకరాలకుగాను 15.65లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి.
ఈ వానకాలం సీజన్లో రైతులు ఏఏ పంటలు వేశారనేది తెలుసుకునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ యంత్రాంగం సాగు సర్వేను చేపట్టింది. గతంలో చేసిన సర్వేలు అంచనాలు మించడంతో ఈసారి పకడ్బందీగా చేయాలని సర్కారు ఆదేశింది. ఈ నేపథ్యంతో రెవెన్యూ యంత్రాంగం సహకారం తీసుకోనున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబర్లో ఎంత భూమి ఉన్నదనేది ధరణి పోర్టల్ ద్వారా వివరాలు తీసుకొని దాని ఆధారంగా ట్యాలీ చేయనున్నారు. సంబంధిత సర్వే నంబర్ దగ్గరకు వెళ్లి అందులో ఎంత భూమి ఉందని సైట్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఎంత సాగు అయ్యింది, ఏ పంట ఎంత, ఖాళీగా ఎంత ఉందనే వివరాలు సేకరించి రైతుబంధు పోర్టల్‌లోని క్రాఫ్ బుకింగ్ సైట్లో పొందుపర్చనున్నారు. ప్రధానంగా వరి, పత్తి సాగు ఎక్కువగా ఉండడంతో ఆయా పంటలు ఏ పద్ధతిలో సాగు చేశారు, ఎంత సాగు చేశారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
పంటల సాగులో తేడాలు ఉండొద్దనే ఉద్దేశంతో సాగు సర్వేను నాలుగంచెలుగా నిర్వహిస్తున్నారు. మొదట ఏఈఓ వీఆర్ఏతో కలిసి గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల వారీగా పంటల సర్వే చేసి క్రాఫ్ బుకింగ్ సైట్లో ఏఈఓ లాగిన్‌లో పొందుపరుస్తాడు. ఈ సర్వే అనంతరం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని పలు సర్వే నంబర్ల వివరాలు ఏఓ లాగిన్లోకి వస్తాయి. ఆయా సర్వే నంబర్లలో ఏఓలు సర్వే చేసి వారి లాగిన్‌లో పొందుపర్చాలి. ఆ తర్వాత ఏడీఏలు ఏఓలు రీసర్వే చేసిన సర్వే నంబర్లలో, ఏడీఏలు సర్వే చేసిన వాటిలో డీఏఓ కొన్ని సర్వే నంబర్లలో సర్వే చేసి వాటిలో వాస్తవికతను గుర్తించి ఆయనకు సంబంధించిన లాగిన్‌లో పొందుపర్చాలి. ఆ తర్వాత నాలుగో అంచెలో భాగంగా ఏదేని ఒక శాఖ అధికారులతో థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయించేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు మండలాల్లో సర్వే చేసి మంచి ఫలితాలు రావడంతో అదే ఇక్కడ అమలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 21.58 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 15.65 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయని యంత్రాంగం అంటున్నది. ఇందులో నిజమెంత అనేది తెలుసుకునేందుకే ఈ సర్వే. గడిచిన రెండు యాసంగి సీజన్లలో జిల్లాలో వరి సాగు అంచనాకు మించి పంట ఉత్పత్తులు రావడంతో వాటి కొనుగోళ్లకు సర్కారు ప్రయాస పడింది. 20శాతం వరకు అంచనా తగ్గడంతో నిక్కచ్చిగా ఉండాలని ఈ సారి పకడ్బందీగా సాగు సర్వే చేపడుతున్నది. జిల్లాలో ప్రధానంగా వానకాలం సీజన్లో పత్తి ఎక్కువ సాగవుతుండగా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తుల్లో తేడాలు ఉండొద్దని సర్కారు సర్వే చేపడుతున్నది.
పంటల సర్వే ప్రతి ఏటా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సర్వే నంబర్లపై పట్టు లేనందున లెక్కల్లో తేడాలు వచ్చేవి. దాంతో పంట ఉత్పత్తుల అంచానా సరిగా ఉండేది కాదు. ఈ సారి పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాకు ఇద్దరు ఏఓలకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకొని ఇక్కడ ఏఈఓలకు శిక్షణ ఇచ్చాం. ఈసారి వీఆర్ఏల సహకారంతో ధరణి పోర్టల్‌లో ఉన్న భూముల ఆధారంగా ప్రతి సర్వే నంబర్లోని భూములను పరిశీలించి వాటిలో ఏ పంటలు, ఎంత సాగు చేశారనేది సేకరిస్తున్నాం.