పెరుగుతున్న కేసులతో ఆందోళన
సొంత వైద్యంతో ప్రాణహాని
పరిసరాల పరిశుభ్రతే కీలకం
అప్రమత్తమైన అధికారులు
పుర, పంచాయతీ, వైద్యశాఖ సంయుక్త చర్యలు
డెంగీ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మారిన వాతావరణ పరిస్థితులు.. కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. రెండు నెలలుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పుర, పంచాయతీ, వైద్య శాఖలు సంయుక్తంగా నివారణ
చర్యలు చేపట్టాయి. ప్రజలు తమ వంతుగా జాగ్రత్తలు పాటించాలని సూచి స్తున్నవి. పరిసరాల పరిశుభ్రత, మురుగు నిలువ లేకుండా చూడాలని అవగాహన కల్పిస్తున్నవి. సొంతవైద్యం మాని సకాలంలో చికిత్సలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): రెండు నెలల కాలంలో డెంగీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పంచాయతీ, పురపాలికల శాఖలతో పాటుగా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. వర్షాకాలం కావడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇటీవల చాలా మంది ప్రజలు డెంగీకి గురవుతున్నారు. ఈ కారణంగా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పురపాలికలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ఇండ్ల మధ్య నిలిచే మురుగు గుంటల్లో దోమల లార్వాలను చంపే ఆయిల్ బాల్స్‌ను విడుదల చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోపాటు ఫినాయిల్, మలాథీన్లతో పాటుగా ఫాగింగ్ చేపడుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉంది. పారిశుధ్య చర్యల్లో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డేను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది. వైద్యఆరోగ్య శాఖ కూడా ఫీవర్ సర్వే చేపడుతున్నది. ఇందులో జ్వరంలాంటి లక్షణాలున్న ప్రజలను గుర్తించి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో డెంగీ, కరోనా లక్షణాలున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే సంబంధిత రోగి కుటుంబీకులు, పొరుగు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా పారిశుధ్య చర్యలను చేపడుతున్నారు.
రెండు నెలలు..29 డెంగీ కేసులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో గత రెండు నెలల్లో 29మంది డెంగీకి గురయ్యారు. ఇది ప్రభుత్వ దవాఖానల్లో చేయించిన పరీక్షల ద్వారా తేలింది. అయితే ప్రైవేట్‌లోనూ చాలా మంది పరీక్షలు చేయించుకుంటూ చికిత్స పొందుతున్నారు. నల్లమల ఏజెన్సీ ప్రాంతాలపై అధికంగా ప్రభావం చూపే అవకాశముండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు కూడా తమ ఇండ్లల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డెంగీ జ్వరం కరోనా లక్షణాల మాదిరిగా ఉండటంతో సొంత వైద్యం చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది డెంగీని మరింత పెంచే ప్రమాదం ఉంది. డెంగీ సోకితే నాలుగు నుంచి పది రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. మూడు రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై ప్లేట్లెట్లు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో జలుబు, జ్వరం, విరేచనాలు, తలనొప్పిలాంటి లక్షణాలు ఒకట్రెండు రోజులకు మించితే దవాఖానలో సంప్రదించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
డెంగీపై నిర్లక్ష్యం వద్దు
డెంగీ వచ్చినా ఆందోళన చెందవద్దు. సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం అవుతుంది. కరోనా లక్షణాలుగా భావించి సొంత చికిత్సలు చేసుకోవద్దు. జిల్లాలో ఇలాంటి అనుమానిత లక్షణాలున్న ప్రజల రక్తనమూనాలను మహబూబ్‌నగర్‌కు పంపిస్తున్నాం. జిల్లాలో రెండు నెలల్లో 29మందికి డెంగీ వచ్చింది. ప్రజలు ఇండ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పారిశుధ్య చర్యలు చేపడుతున్నాం
పట్టణ ప్రగతిలో భాగంగా ఇంతకు ముందే పారిశుధ్య చర్యలు చేపట్టాం. వైద్యశాఖతో కలిసి పారిశుధ్యం, దోమలు నిల్వ ఉండకుండా ఫాగింగ్, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ చల్లుతున్నాం.
పగలు కుట్టే ఎడిస్ దోమకాటుతోనే..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు22: పగలు కుట్టే ‘ఎడిస్ ఈజిప్ట్’ అనే దోమ వల్ల డెంగీ వ్యాపిస్తుంది. ప్రధానంగా డెంగీ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచుకోవడం.. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం మూలంగా డెంగీ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి డెంగీని తరిమికొట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
పల్లె ప్రగతితో తగ్గిన కేసులు
గతంలో సరైన జాగ్రత్తలు, పారిశుధ్య చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు అవగాహన లేక సీజనల్ వ్యాధుల ప్రబలేవి. స్వరాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులు, వీధులల్లో ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దీంతో గతంలో కంటే డెంగీ కేసులు, ఇతర సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
స్వీయ పరిరక్షణతోనే వ్యాధిని నియంత్రించుకోవచ్చు.
ముందుగా ఎవరికి వారే తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మురుగు కాల్వలో తరచూ నీళ్లు పారేలా చూసుకోవాలి.
పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, ఎయిర్ కూలర్లు, డబ్బాలు, ప్లాస్టిక్ కప్పులు, పాత్రల్లో నీటిని నిల్వఉంచుకోకుండా రెండు రోజులకోసారి మారుస్తుండాలి.
లార్వా వృద్ధి చెందకుండా నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ గాని కాలిన ఆయిల్ బాల్స్‌లను గానీ వేయాలి. ఇంటి కిటికీలు, తలుపులకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
చీకటి పడకముందే ఈగలు, దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులు వేసుకోవాలి. వీలైనంత వరకు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, పగటిపూట పొడుగు చేతుల చొక్కా, పైజామా, ప్యాంటు వేసుకోవాలి. ఎడిన్ దోమ ఎక్కువ దూరం ప్రయాణించలేదు. కాబట్టి ఇంట్లోనే సరైన జాగ్రత్తలు తీసుకుంటే డెంగీని నివారించవచ్చు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కేసులు
జిల్లాలో డెంగీ వ్యాధి క్రమంగా విస్తరిస్తున్నది. అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవడం లేదు. పాజిటివ్ కేసు తేలితేనే వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. వాస్తవానికి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు 30కేసులు నమోదు అయ్యాయి.
సకాలంలో దవాఖానకు వెళ్లాలి
డెంగీ దోమ కుట్టిన వారిలో తరచూ తీవ్రజ్వరం రావడం, శరీరంపై దుద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరు వెంటనే అందుబాటులో ఉన్న దవాఖానలో వైద్యులను సంప్రదించాలి. పరిసరాల శుభ్రత పాటించి ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెంగీని అరికట్టవచ్చు.