ధరణి రిజిస్ట్రేషన్లకు సమయపాలన పాటించాలి
ఆరు మండలాల తాసిల్దార్లకు మెమోలు జారీ చేయాలి
కలెక్టర్ మనుచౌదరి
నాగర్‌కర్నూల్, ఆగస్టు 21: జిల్లా వ్యాప్తంగా ధరణి పోర్టల్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 1,620 రిజిస్ట్రేషన్ల కేసుల పార్టీలతో సమగ్ర వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తి చేసి తన లాగిన్‌కు పంపించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, తాసిల్దార్లతో ధరణి పెండింగ్ రిజిస్ట్రేషన్లు లాగిన్ వివరాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు తాసిల్దార్ కార్యాలయంలో ధరణి లాగిన్‌లో నిర్దేశించిన సమయానికి హాజరుకాని కొల్లాపూర్, పెంట్లవెల్లి, లింగాల, పదర, అమ్రాబాద్, ఉప్పునుంతల మండలాల తాసిల్దార్లకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. తాసిల్దార్ లాగిన్‌లో పెండింగ్ రిజిస్ట్రేషన్ల సమగ్ర వివరాలతో పరిష్కరించి కలెక్టర్ లాగిన్‌కు పంపించాలన్నారు. తాసిల్దార్లు తమ పరిధిలోని పెండింగ్ వివరాలతో, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తాసిల్దార్లు సకాలంలో లాగిన్ కావాలని సూచించారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్‌గా ధరణిలో పొందుపరిచిన లేదా ప్రొహిబిటెడ్ నుంచి తొలగించాల్సి ఉన్నా జాగ్రత్తగా పరిశీలించి సిఫారసు చేయాలన్నారు. ప్రతి అంగుళం ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని తెలిపారు. ఇందుకుగానూ ఆయా గ్రామ పంచాయతీలో ఏ సర్వేనెంబర్లలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో రికార్డు చేసి పెట్టుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు, తాసిల్దార్లు పాల్గొన్నారు.