సీత్లాభవానీ అమ్మవారికి పూజలు
అలరించిన గిరిజన మహిళలు, యువతులు ఆటాపాటలు
అచ్చంపేట, ఆగస్టు 21:అచ్చంపేట పట్టణంలో తీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో బంజారులు జరుపుకొనే మొలకల పండుగ అచ్చంపేటలో అయిదోసారి నిర్వహిస్తున్నారు. శనివారం మొదటిరోజు బంజారుల ఇష్టదైవం సీత్లాభవానీ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. బంజార మహిళలు, యువతులు ఆటాపాటలతో సాంప్రదాయబద్ధంగా గోధుమలు నానబెట్టారు. గిరిజన భవనం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. 22న తీజ్బుట్లకు పూజలు, రాఖీపౌర్ణమి నిర్వహించనున్నారు. 23న భజన, ఉయ్యాల కార్యక్రమం, 24న గౌరి, గౌరిలక్క పూజలు, 25న ఘనగోర్, 26న గిరిజన సంస్కృతిక కార్యక్రమాలు, 27న చఢోక్లిధూండ్, 28న సేవాలల్, మేరామ అమ్మవారికి మహాబోగ్ పూజలు, 29న తీజ్ బుట్లతో నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ గిరిజన భవనం వద్ద ఆటాపాటలు ఉంటాయని తెలిపారు. తీజ్ పండుగను బంజారులు నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకొంటారు. బంజార యువతులు పూజారులుగా ఉంటూ తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో తీజ్బుట్లకు ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తూ ఉపవాసం ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో కళకళలాడాలని, కుటుంబాలు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం, తండాలు, గ్రామాలు, పల్లెలు సుభిక్షంగా ఉండాలని, గోమాత సంరక్షణ కోరుతూ పూజలు చేస్తారు. పంటలు పుష్కలంగా పండి ధాన్యలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టాలని మేరమ్మతల్లి, సేవాలాల్ మహారాజ్‌కు పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే అచ్చంపేట తీజ్ పండుగకు ప్రత్యేకత ఉన్నదన్నారు. తొమ్మిది రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బంజార మహిళలు, యువతులు ఆటాపాటలతో తీజ్ పండుగ సందడి ప్రారంభమైంది. కార్యక్రమంలో తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు బిచ్యానాయక్, మంత్రియానాయక్, గోపాల్‌నాయక్, లోక్యనాయక్, మంగ్యానాయక్, రాంబాబు, కౌన్సిలర్లు సోమ్లానాయక్, సుగుణమ్మ, మోహన్‌లాల్, రాములునాయక్, హన్మంతు, లచ్చునాయక్, హతీరాం, రఘునాయక్, చందులాల్బావోజీ, తులసీరాం, జైపాల్, బాల్‌రాం, బాలునాయక్, వసూరం, శ్రీనునాయక్, చత్రునాయక్, లక్ష్మణ్, పత్య, డీటీ నాయక్, ప్రేమ్, కేఆర్ శంకర్, శ్రీరాం, వంశి, సేవ్య, నాగ, నాన్య, నరేందర్, కిషన్, బిక్య, పుల్యి తదితరులు పాల్గొన్నారు.