లింగాల, ఆగస్టు 19: తప్పెట దరువులకు దూలా అసోన్దూలా అంటూ అలాయి చుట్టూ యువకులు చిందు లు వేస్తూ ఉత్సాహంగా గ్రామాల్లోసాగే పీర్ల పండుగ సంబురాలు మండలంలోని ఆయా గ్రామాల్లో భక్తిశ్రద్ధ్దలతో కొనసాగుతున్నది. పీర్లపండుగ వచ్చిందంటే పదిరోజులపాటు హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. పీర్లకు మొక్కుబడులు తీర్చుకోవడానికి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు తిరిగి స్వగ్రామాలకు చేరుకోవడం తో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. మండలంలోని లింగాల, అప్పాయిపల్లి, అంబట్పల్లి, కొత్తకుంటపల్లి, జీలుగుపల్లి, ధారారం తదితర గ్రామాల్లో మతసామరస్యానికి ప్రతీకగా పీర్లపండగను సంతోషంగా జరుపు కొంటున్నారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్ ఆగస్టు 19: మండలంలోని అన్ని గ్రామాల్లో పీర్లపండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చావిడీల్లో పీర్లను నిర్వాహకులు అలంకరించారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీజా, మటికీలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నలాల్, పెద్దలాల్, కత్తులపంజా, బెల్లం సవారీ పేర్లతో పీర్లను పిలుస్తూ కొలుస్తున్నారు. గురువారం పెద్దసరిగత్ పేరుతో నిర్వహించే వేడుకల్లో పీర్లను ఎత్తుకుని ఆడిస్తూ అలాయి చుట్టూ తిప్పారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. నేటితో నిమజ్జనం నిర్వహించి ఈ వేడుకలు ముగుస్తాయని ముజార్లు మహబూబ్అలీ, జహంగీర్, ఖైరాత్, అయూబ్, సర్దార్ తదితరులు తెలిపారు.
పెద్దకొత్తపల్లిలో..
పెద్దకొతపల్లి, ఆగస్టు 19: మండలంలో పీర్ల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. వారం రోజులుగా గ్రామాల్లోని చావిడీల్లో కొలువుదీరిన పీర్లకు పూజలు చేస్తూ ప్రజలు మొక్కులు తీర్చుకుంటున్నారు. రాత్రివేళ కులమతాలకు అతీతంగా అలయ్ ఆడుతూ సంబురాలు జరుపుకొంటున్నారు. దీంతో గ్రామాల్లో వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది.