నాగర్‌కర్నూల్, ఆగస్టు 15: నిరుపేద దళితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేయనున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం 56మందికి ఒక్కొక్కరికి రూ.50వేలతో ఒక్కో యూనిట్ పంపిణీ చేశారు. 13మందికి టైలరింగ్ మిషన్ల సామగ్రి, 10మందికి చీరల, చెప్పుల దుకాణాలు నడుపుకునేందుకు, 33మందికి పాడి గేదెల యూనిట్లను పంపిణీ చేశారు. 56యూనిట్లకు రూ.28లక్షలతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక రకాల యూనిట్లను అందజేస్తున్నారని, రానున్న రోజుల్లో నేరుగా వారి ఖాతాలో రూ.10లక్షలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు. దళితులందరూ ఆర్థికంగా రాణించాలని సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్‌లాల్, డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలను ఎమ్మెల్యే అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, వైస్‌చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు ఉన్నారు.