నాగర్కర్నూల్, ఆగస్టు15: తెలంగాణ అవతరించినప్పటి నుంచి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా భావించి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కలెక్టర్ మనుచౌదరి, ఎస్పీ సాయిశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతితో కలిసి ఆయన జెండావిష్కరణ చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ, ఉపాధి పనులను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మలుచుకోవడానికి అందరి సహకారం అవసరమని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నో పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. దళితబంధుతో ప్రతి దళిత కుటుంబంలో వెలుగులు నిండనున్నాయని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.