హరితహారంలో నాటిన మొక్కల లెక్కింపు
నేటి నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం
అధికారుల బృందాల నియామకం
రోజూ వివరాలు ఆన్లైన్లో నివేదన
మొక్కల పెంపకంపై మరింత దృష్టి
వనాలు పెంచి పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాలు,
పురపాలికల్లో రెండేండ్లుగా నాటిన మొక్కల వివరాలను సేకరిస్తున్నది.
బుధవారం నుంచి 15వ తేదీ వరకు మొక్కల గణన పూర్తి చేసేందుకు ప్రభుత్వం
ఆదేశించగా సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా సంసిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల సిబ్బందిని బృందాలుగా నియమించారు. దీనికి మండల స్థాయిలో ఈజీఎస్ ఏపీవో పర్యవేక్షణలో గణన ప్రక్రియ
రాండామ్గా చేపట్టనున్నారు. రాష్ట్ర అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రోజూ చేసిన సర్వేను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
నాగర్కర్నూల్, ఆగస్టు31 (నమస్తే తెలంగాణ): హరితహారం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం జిల్లాలో లక్షలాది మొక్కలను నాటడం జరుగుతున్నది. రాష్ట్రంలో 27శాతం ఉన్న అటవీ భూభాగాన్ని 33శాతంగా చేసేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రికగా పిలిచే హరితహారం పథకం 2016లో ప్రారంభమైంది. నాటి నుంచి గ్రామంలో వన నర్సరీలను ఏర్పాటు చేసి వేలాది మొక్కలను నాటుతూ వస్తున్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రకృతి వనాలతో పాటుగా రియల్ వ్యాపారస్తులు ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో మియావాకీ ప్లాంటేషన్ పేరుతో మొక్కలు నాటుతూ రక్షణ చర్యలు తీసుకుంటూ నీళ్లు పోస్తూ బతికిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా సర్పంచ్, ఎంపీటీసీల్లాంటి గ్రామస్థాయి నేతల వరకు హరితహారంలో భాగమవుతున్నారు. మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది. ఇన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మొక్కల పెంపకంపై అక్కడక్కడా విమర్శలూ వస్తున్నాయి. దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ నివేదికలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వారం పాటు సర్వే..
ఇటీవలే రాష్ట్ర అటవీ శాఖ అధికార శాంతకుమారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించారు. రెండేండ్లలో నాటిన మొక్కల వివరాలను ఇందులో భాగంగా సేకరించనున్నారు. ఈప్రక్రియ సెప్టెంబర్ 1నుంచి 15వరకు రెండు వారాల పాటు జరగనున్నది. హరితహారంలో భాగంగా అటవీ శాఖతో పాటుగా డీఆర్డీఏ, మున్సిపాలిటీ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ అన్ని శాఖలు మొక్కలు నాటుతున్నాయి. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తూ టీజీఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతున్నది. ఇలా ఏయే ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటారనే వివరాలు ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు చేరాయి. నాటుతున్న మొక్కలను మరింత కాలం పెంచుతూ చెట్లుగా ఎదిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా రెండేళ్లలో నాటిన మొక్కల పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో వివరాల సేకరణకు సిద్ధమైంది.
బృందాల నియామకం
హరితహారంలో భాగంగా అటవీ, డీఆర్డీఏ, మున్సిపల్ శాఖల సమన్వయంతో నాటిన మొక్కల గణనను చేపట్టనున్నారు. దీనికిగాను ఇప్పటికే ఆయా శాఖల సిబ్బందిచే బృందాలను నియమించారు. దీనికి మండల స్థాయిలో ఈజీఎస్ ఏపీవో పర్యవేక్షణలో మొక్కల గణన జరగనున్నది. రాష్ట్ర అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఈ సర్వే జరుగుతుంది. బ్లాక్ ప్లాంటేషన్, లీనియర్ ప్లాంటేషన్, స్కాటర్డ్ ప్లాంటేషన్లపై ఈ సర్వే కొనసాగనున్నది.
మొక్కల పూర్తి వివరాలు నమోదు
ప్రతిరోజూ చేసిన సర్వేను అధికారులు ఆన్లైన్లో నివేదిస్తారు. ఇందులో భాగంగా రెండేండ్లలో ఆయా ప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎన్ని, ఎంత ఎత్తు ఎదిగాయి.., ఎన్ని చనిపోయాయి…, బతికిన మొక్కలు ఎన్ని.., చనిపోయిన మొక్కల స్థానంలో నాటిన మొక్కల శాతం లాంటి అంశాలను సేకరిస్తారు. ఈ అంశాలను సేకరించిన తర్వాత నివేదిక రూపంలో జిల్లాస్థాయిలో అధికారులు ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం హరితహారాన్ని మరింత సమర్థవంతంగా అమలు, నిర్వహణకు చర్యలు తీసుకోనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 2019-20లో 75లక్షలు, 2020-21సంవత్సరంలో 75లక్షల చొప్పున కోటీ 50లక్షల మొక్కలు నాటారు. ఈ సర్వేలో భాగంగా 461గ్రామ పంచాయతీలు, 4మున్సిపాలిటీ పరిధిలోని 261ప్రాంతాల్లో సర్వే జరగనున్నది. ఇప్పటికే ఆయా శాఖల ఆధ్వర్యంలో సర్వేకు అధికారుల బృందం సమాయాత్తమైంది.