గీసుగొండ, మార్చి 12 : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న 75 సంవత్సరాల వజ్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. వేడుకకు హాజరైన ఎమ్మెల్యేను పూర్వ విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మన బస్తీ-మన బడి కార్యక్రమంలో ధర్మారం పాఠశాలలో రూ. 62 లక్షలతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. రూ.80 లక్షలతో తరగతి గదులు నిర్మించామని చెప్పారు. పాఠశాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నదని, ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో రెసిడెన్షియల్ స్కూల్‌నూ నిర్మించుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ. లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ముగింపు వేడుకల సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు గాదె దయాకర్, కార్పొరేటర్ మనీషాశివకుమార్, హెచ్ఎం సుజాత, రిటైర్డ్ హెచ్ఎం నర్సింహారెడ్డి, పూర్వ విద్యార్థులు గోలి రాజయ్య, బాబు, ముత్తిలింగం, సంతోష్, రాంబాబు, మోహన్, శివకుమార్ పాల్గొన్నారు.
సంగెం : బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ బీమా చేయించి వారి కుటుంబాల్లో పార్టీ భరోసా నింపిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన సౌరం స్వామి ఇటీవల పాముకాటుతో మృతి చెందాడు. స్వామి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల బీమా చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు మృతి చెందితే వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ ప్రమాద బీమా చేయించారని తెలిపారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, సౌరం సంపత్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.