
జడ్చర్లటౌన్, ఆగస్టు15:ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా 108 బైక్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి ప్రజలకు సత్వర వైద్యం అందిస్తున్నది.
జీవీకే, ఈఎంఆర్ఐ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏడాది కిందట 108 బైక్ అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, లింగాల, పదర, మన్ననూర్, పెద్దమందడి, బల్మూర్, అచ్చంపేట ప్రాంతాల్లో 108బైక్ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి.
మారుమూల ప్రాంతాలు, ఫోర్‌వీలర్ అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రదేశాల్లో సైతం ప్రజల వద్దకు చేరుకుని ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్(ఎఫ్ఆర్ఏ) పేరుతో బైక్ అంబులెన్స్‌లను తీసుకొచ్చారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఫోర్ వీలర్ అంబులెన్స్‌లు వెళ్లని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో బైక్ అంబులెన్స్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్నపాటి గల్లీల్లో సైతం వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందేలా 108 బైక్ అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడుతున్నాయి. 108 బైక్ అంబులెన్స్‌లో మెడికల్ కిట్లతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ ట్రైనింగ్ పొందిన ఎఫ్.ఆర్. ఈఎంటీ ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, గుండెపోటు, పాముకాటు బారిన పడ్డ వారికి సత్వరమే వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా విషం తాగిన కేసులు, ప్రసవాలు, బీపీ, షుగర్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఇతరత్రా అనారోగ్య సమస్యలతో దవాఖానకు వెళ్లలేని వారికి సైతం ఇంటి వద్దే ఉచిత వైద్య సేవలు పొందేలా బైక్ అంబులెన్స్ ఉపయోగపడుతున్నది.
బైక్ అంబులెన్స్‌లో 100 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్, బీపీ, షుగర్ టెస్టింగ్ మీటర్లు, పల్స్ మీటర్, కృత్రిమ శ్వాస అందించే అంబు బ్యాగ్, విషం తాగిన వారికి క్లియర్ చేసేందుకు సక్షన్ ఆపరేటర్, స్లైన్బాటిల్స్, కాటన్, ఆయింట్మెంట్స్, ట్యాబెట్లు, మాస్కులు, గ్లౌజులతో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంటుంది.
ఫోర్ వీలర్ 108 అంబులెన్స్‌లో ఉన్న వైద్య సదుపాయాలన్నీ బైక్ అంబులెన్స్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ, అంబులెన్స్ వెళ్లలేని ప్రదేశాలకు బైక్ అంబులెన్స్ ద్వారా చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నాం. సమాచారం రాగానే మొదటగా బైక్ అంబులెన్స్ ద్వారా ప్రమాద స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందిస్తాం. ఆ తర్వాత 108 ఫోర్ వీలర్ అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తున్నాం. ఏడాది కాలంలో జడ్చర్లలో 108 బైక్ అంబులెన్స్ ద్వారా మొత్తం 530 కేసుల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలందించాం.