
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ అర్బన్, ఆగస్టు 10: ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల కేం ద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సం ఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్నదే ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్య తెలంగాణను అందించాలనేదే కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. గతంలో అడవులను నరకడంతో వాతావరణ కాలు ష్యం ఎక్కువగా జరిగేది. హరితహార కార్యక్రమంలో భాగంగా వనాలు పెంచాలనేదే హరితహారం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. గౌడ కులస్తులు ఈత వనాలను అధిక సంఖ్యలో పెంచి ఉపాధి పొందాలని పేర్కొన్నారు. గౌడ కులస్తులు ఆర్థిక స్వావలంబన జరుగాలని ఈత చెట్ల పెంపకం జరుగుతుందన్నారు. గౌడ కులస్తులు ఈత చెట్టు పై నుంచి పడి చనిపోయిన వ్యక్తులకుగానీ, అంగవైకల్యం ఏర్పడిన వ్యక్తులకు ప్రభుత్వం బీమా కల్పించిందని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో కల్లుకు మంచి పేరు ఉందని, కానీ ఆంధ్ర నాయకుల పాలనలో ఈత వనాలకు పెద్దగా అవకాశం ఇవ్వకపోవడంతో కల్తీ ఎక్కువగా జరగడంతో ప్రజలు అనారోగ్యాలపాలయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు పెద్ద పీట వేస్తున్నారని అ న్నారు. గౌడ కులస్తులు ఐదెకరాల్లో 2800 ఈత మొక్కలు నాటుతారన్నారు. ఈత వనాలను గౌడ కులస్తులు అందరూ కలిసి కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి , ఎంపీపీ శేరి నారాయణరెడ్డి , సర్పంచ్ సవిత, ఎక్సైజ్ అధికారులు సీఐ సూర కృష్ణ, గోపాల్, ఎస్సై పాషా, గౌడ సం ఘం సభ్యులు నాగరాజ్‌గౌడ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.