
అంగన్వాడీ కేంద్రాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు
శుభ్రం చేసి, శానిటైజ్ చేయిస్తున్న అంగన్వాడీలు
అంగన్వాడీ టీచర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సర్కారు
చిన్నారులను ఆకట్టుకునేలా వాతావరణం కల్పించేందుకు చర్యలు
ఆరోగ్యలక్ష్మి పథకం కింద వేడివేడి భోజనం
పండుగ వాతావరణంలో కేంద్రాలు తెరిచేందుకు సన్నాహాలు
అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించగా, కేంద్రాల టీచర్లు, సహాయకులు చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాల శుభ్రత, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు తదితర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కేంద్రాలకు రంగులతో పాటు మరమ్మతులు చేసి, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పండుగలా కేంద్రాల ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనాతో 18 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలుమూతపడ్డాయని, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 1నుంచి అంగన్వాడీ కేంద్రాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు తిరిగి బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశానుసారం అంగన్వాడీలను ఈ నెల 31 వరకు అన్ని శుభ్రపర్చాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారులు, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకులు సన్నాహక చర్యలు చేపట్టారు.
సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారు.
మెదక్ జిల్లాలో మొత్తం 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణులు 7121, బాలింతలు 6434 ఉండగా, చిన్నారులు 49213 ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీలు తెరుచుకోనున్నాయి. ఈ
నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపర్చుకోవాలి.
గ్రామ పారిశుధ్య సిబ్బంది సాయంతో శానిటైజేషన్ చేయించుకోవాలి.
సెప్టెంబర్1 నుంచి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీ సభ్యులకు ముందస్తుగా సమాచారం అందించి కేంద్రాలను తెరిచే రోజున హాజరయ్యేలా ఆహ్వానించాలి.
ఖాతాల్లో రూ.500 జమ..
కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులకు భోజనం సరుకుల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యలక్ష్మి, లబ్ధిదారుల భోజనం కోసం స్టవ్, సిలిండర్, వంటపాత్రలను శుభ్రం చేసుకోవాలి. చీపుర్లు, సబ్బులు, శానిటైజర్స్, స్టేషనరీకి సంబంధించిన వస్తువులు కొనుటకు ప్రతి అంగన్వాడీ టీచర్ ఖాతాల్లో రూ.500 ప్రభుత్వం జమ చేసింది.
మొదటి రోజు పండగలా ఉండాలి..
చిన్నారులు చాలా రోజుల తరువాత అంగన్వాడీ కేంద్రాలకు రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీని ముగ్గు, మామిడి తోరణాలతో అలంకరించాలి. కేంద్రం లోపల సైతం పండుగ వాతావరణం తలపించేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యలక్ష్మి పథకం లబ్ధిదారులకు కచ్చితంగా వేడి భోజనం పెట్టాలి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. తొమ్మిది నెలల గర్భిణి, నెల లోపు బాలింతలకు మాత్రమే వారి కుటుంబసభ్యులకు బాక్సులో భోజనం అందజేయాలి. మొదటి రోజు హాజరైన చిన్నారులకు బాలమృతంతో పాటు ఏదైనా స్వీట్ ఇవ్వాలి.
నిర్లక్ష్యం వద్దు..
కేంద్రాల నిర్వహణ, నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వద్దని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు అందించే భోజనం, సరుకుల పంపిణీలో అప్రమత్తంగా ఉండాలి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను తెరిచి ఉంచాలి. టీచర్, ఆయా ప్రతిరోజూ ఇద్దరు విధులకు హాజరుకావాలి.
టీహెచ్ఈర్లో భాగంగా సరఫరా చేసిన గుడ్లు, పాలు, పప్పు, నూనెలను సత్వరం లబ్ధ్ధిదారులకు అందచేయాలి.
అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలి.
అప్రమత్తంగా ఉండాలి..
సెప్టెంబర్ 1నుంచి అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోనుండడంతో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను శుభ్ర చేసుకుని, గ్రామ పారిశుధ్య సిబ్బంది సాయంతో శానిటైజేషన్ చేయిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలి. ప్రధానంగా కొవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సమయపాలన పాటించాలి..
అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నారులకు బాలింతలు, గర్భిణులకు పోషకాహారం వేడివేడిగా అందించాలి. అంగన్వాడీ కేంద్రాలను తెరిచే కార్యక్రమాన్ని ఒక పండగలా జరపాలని అంగన్వాడీల టీచర్లకు సూచించాం.