
ఆహ్లాదాన్ని పంచే అర్బన్ పార్కు
పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం
అందాల వీక్షణకు క్లాక్ టవర్
పచ్చని చెట్లు, రకరకాల పక్షులు.. జంతువులు, ఔషధ మొక్కలకు నిలయం
వారాంతంలో తరలివస్తున్న జనం
వీకెండ్ స్పాట్‌గా నర్సాపూర్ ఫారెస్ట్ మారింది. అర్బన్ పార్కు ఆహ్లాదాన్ని పంచుతున్నది. వారాంతంలో హాయిగా.. సరదాగా గడిపేందుకు వేదికవుతున్నది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో వారాంతంలో పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ఒక్కసారి పార్కులో అడుగుపెట్టామంటే సువాసనను వెదజల్లే చెట్లు.. ఆహ్లాదపరిచే పక్షులు.. సీతాకోక చిలుకలు.. సహజశీల నిర్మాణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ పైకి ఎక్కి అటవీ, చెరువు అందాలను వీక్షించవచ్చు.
నర్సాపూర్, ఆగస్ట్టు 28 : బిజీ లైఫ్‌లో కాసేపు సేద తీరాలని అనుకుంటున్నారా.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ సరదాగా గడపాలనుకుంటున్నారా.. వీటికి పక్కా అడ్రస్ నర్సాపూర్ అర్బన్ పార్కు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి అటవీ ప్రాంతాలను పార్కులుగా అభివృద్ధ్ది చేస్తున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్కుగా అభివృద్ధి చేసింది. నర్సాపూర్‌లోని అటవీ ప్రాంతంలో 252 హెక్టార్లలో అర్బన్ పార్కును నిర్మించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పర్యాటకులను పార్కులోనికి అనుమతిస్తారు. పార్కును ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పెద్ద వారికి రూ.50, పిల్లలకు రూ.30 టికెట్ వసూలు చేస్తున్నారు. అర్బన్ పార్కులో పర్యాటకులను ఆకర్షించడానికి క్లాక్‌టవర్, అడవి దున్న విగ్రహం, ఔషధ, వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో వీకెండ్ రోజుల్లో పర్యటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. మామూలు రోజుల్లో 50 మంది, సెలవు దినాల్లో సుమారు 200 మంది వరకు పర్యాటకులు అర్బన్ పార్కును సందర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో నివసించే విదేశీయులు సైతం నర్సాపూర్ అర్బన్ పార్కును సందర్శించి, అటవీ అందాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారంటే అర్బన్ పార్కుఅందాలను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, టేబుల్స్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో సహా పార్కును సందర్శించి, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. సైక్లిస్ట్‌లు సైతం నర్సాపూర్ అటవీ అందాలు చూడడానికి అర్బన్ పార్కుకు విచ్చేసి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాధిస్తున్నారు. ఒక్కసారి పార్కులో అడుగుపెట్టామంటే సువాసనను వెదజల్లే చెట్లు, ఆహ్లాదపరిచే పక్షులు, సీతాకోక చిలుకలు, సహజశీల నిర్మాణాలతో పర్యాటకులు మమేకమైపోవచ్చు. అర్బన్ పార్కులో ఏర్పా టు చేసిన క్లాక్ టవర్ పైకి ఎక్కి అటవీ, చెరువు అందాలను వీక్షించవచ్చు.
పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు..
అర్బన్ పార్కులో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధ్దం చేశాం. ప్రస్తుతం కాటేజీల నిర్మాణం కొనసాగుతున్నది. పర్యాటకులకు ఆరు, అధికారులకు 3 కాటేజీలను నిర్మిస్తున్నాం. పర్యాటకులు రాత్రివేళలో బస చేయడానికి కాటేజీలు ఉపయోగపడుతాయి. ఇప్పటికే సైక్లింగ్ ఫాత్ను పూర్తి చేశాం. సేదతీరడానికి నర్సాపూర్ అర్బన్ పార్కు సరైన చోటని చెప్పవచ్చు. మున్ముందు అర్బన్ పార్కును ఇంకా అభివృద్ధ్ది చేసి పర్యాటకులను ఆనందింపజేస్తాం