
శివ్వంపేట మండలంలో ప్రభత్వ పాఠశాలలను సందర్శించిన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మనోహరాబాద్, ఆగస్టు 26: నెలాఖరులోగా పాఠశాలలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కల, గోమారం, బిజిలిపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. పాఠశాలల ఆవరణలో కలుపు మొక్కలను తొలిగించి మరుగుదొడ్లు, తరగతి గదులను శుభ్రం చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటి సౌకర్యం కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చంద్రకళ, లావణ్యమాదవరెడ్డి, లక్ష్మి, ఉమా, ఉప తహసీల్దార్ సాదత్, ఎంపీడీవో నవీన్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తొనిగండ్ల, ఆర్.వెంకటాపూర్ పాఠశాలలను సందర్శించిన జడ్పీసీఈవో శైలేశ్‌కుమార్
రామాయంపేట,ఆగస్ట్టు 26: ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్ర ంగా ఉంటేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీసీ ఈవో శైలేశ్‌కుమార్ అన్నారు. మండలంలోని తొనిగండ్ల, ఆర్.వెంకటాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం పాఠశాలను ప్రారంభిస్తుందని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా చేసే బాధ్యత ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్‌లదే అన్నారు. పాఠశాల గదుల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. ఈనెల 30 లోగా ఉపాధ్యాయులు, సర్పంచ్‌లు పూర్తిస్థాయి నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలన్నారు. తొనిగండ్లలో ఉపాధిహామీ రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో రామాయంపేట ఇన్చార్జి ఎంపీడీవో గిరిజారాణి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహేందర్‌రెడ్డి, పిట్ల రాణమ్మ, కార్యదర్శులు సీహెచ్.శ్యామాల, బూలింగం, బాలకృష్ణ తదితరులున్నారు.
రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు పరిశుభ్రంగా ఉంచాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలికల పాఠశాల, గురుకుల పాఠశాలలను పరిశీలించి పారిశుధ్య కార్మికులతో చెత్త తొలిగించారు. అనంతరం చైర్మన్ మాట్లాడారు. గురుకులాల్లో ప్రతిరోజు శానిటైజేషన్ , భౌతిక దూరం పాటించి పాఠాలను బోధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. చైర్మన్ వెంట కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బొర్ర అనిల్‌కుమార్, సుందర్‌సింగ్, టీఆర్ఎస్ నాయకులు మల్యాల కిషన్ ఉన్నారు.
నందిగామ పాఠశాలను…..
నిజాంపేట,ఆగస్టు26: పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా మండలంలోని అన్ని పాఠశాలలను శుభ్రం గా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో శైలేశ్‌కుమార్ అన్నారు. ఆయన మండలంలోని నం దిగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరి ంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు,ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సురేశ్, పంచాయతీ కార్యదర్శి మహ్మమద్ ఆరిఫ్ హుస్సేన్, గ్రామస్తులు రాజ్‌గోపాల్, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
కొల్చారంలో…
కొల్చారం, ఆగస్టు 26: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను తెరిచేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు ప్రారంభించారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, ఆగస్టు 26. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానుండడంతో కరోనా నిబంధనలతో తరగతులను నిర్వహించాలని తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంఈవో యాదగిరి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి శుభ్రం చేసి, శానిటేజేషన్ చేయించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో అన్ని గ్రామాలను క్లస్టర్ వారీగా విభజించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, ఒక్కో అధికారి నాలుగు పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. వారివెంట పంచాయతీ కార్యదర్శి బలరాంరెడ్డి, హెచ్ఎం సాంబయ్య, ఎస్వో ఫాతిమా, వీఆర్వో, ఉపాధ్యాయులు ఉన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్,ఆగస్టు 26: కొవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యాబోధన చేయాలని మండల విద్యాధికారి బుచ్చానాయక్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూ చించారు. ప్రధానోపాధ్యాయులతో ఎంఈవో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో పాఠశాలలను శానిటైజేషన్‌ను స్థానిక సంస్థల సహాయంతో చేయించుకోవాలని సూచించారు.
చేగుంటలో…
చేగుంట ఆగస్టు26: సెప్టెంబర్1 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నార్సింగి ఎంపీపీ సబిత అన్నారు. నార్సింగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి జగదీశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాఠశాలలో మౌలిక వసతులపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్మేరి, వడియారం హెచ్ఎం గంగాబాయి, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు,సర్పంచ్‌లు,పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.