
మెదక్, ఆగస్టు 25 : ఇక ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా వేయనున్నారు. కరోనా వైరస్ మొదటి, రెండో దశల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. థర్డ్‌వేవ్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇందుకు టీకానే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పీహెచ్‌సీల్లో టీకాలను తీసుకునేందుకు ప్రజలు రాకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ టీకా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది.
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2,43,696 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లాలో 18 ఏండ్ల వయసు పైబడిన వారు 5,17,428 మంది ఉన్నారు. 18 నుంచి 44 ఏండ్ల వయస్సు వారు 60, 005 మంది, 45 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకు 1,13,070 మంది, 60 ఏండ్ల వయస్సు వారు 59,719 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా జిల్లాలో రెండున్నర లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సంబంధిత సిబ్బంది ఇంటికి వెళ్లి టీకాలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు. 21 మండలాల్లో మొత్తం 7.67 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దాదాపు 5.17 లక్షల మంది 18 ఏండ్లు నిండిన వారున్నారు. ఇందులో 18 నుంచి 44 సంవత్సరాలలోపు 3,91,388 మంది ఉన్నారు. 45 ఏండ్ల వయస్సు వారు 1,26,048 మంది ఉన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటతో పాటు ఆయా పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది.