
సిలిండర్‌పై రూ.25 అదనపు వడ్డింపు
రూ.వెయ్యికి చేరువలో గ్యాస్ ధర
పేదలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం
జిల్లా ప్రజలపై నెలకు రూ.50 లక్షల అదనపు భారం
కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో జనం.. నడ్డి విరుస్తున్న కేంద్రం
లబోదిబోమంటున్న పేద, మధ్య తరగతి ప్రజలు
మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధర
వంట గ్యాస్ సిలిండర్ పెంపు ధరలు ఇలా..
జనవరి 648.50
ఫిబ్రవరి 823.50
మార్చి 878.00
ఏప్రిల్ 878.00
మే 863.00
జూన్ 863.00
జూలై 889.00
ఆగస్టు 914.00
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 22: వంటింట్లో మరోసారి గ్యాస్ బాంబు పేలింది. గ్యాస్ వెలిగించకుండానే మండుతోంది. పెరుగుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. రెండు నెలల క్రితమే గ్యాస్ ధర రూ.20.50 పెరిగింది. తాజాగా ఒకేసారి రూ.25 పెంచడంతో వినియోగదారులపై ఆదనపు భారం పడినట్లయ్యింది. ఇప్పటికే డీజిల్, పెట్రోలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఖర్చులతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహావసరాలను వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ.887 ఉండగా, ప్రస్తుతం రూ.914కు చేరింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19కిలోల సిలిండర్ ధర రూ.5 తగ్గించగా, ధర రూ.1798కి చేరింది. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఒక సిలిండర్‌పై రూ.175 పెరిగింది.
ప్రజల్లో తీవ్ర నిరసన..
అసలే కరోనా కారణంగా ప్రతి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ తేరుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఏడాది కాలంగా ధరలు పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు, వంటగ్యాస్ ధరను ఇప్పుడు రూ.25 పెంచాయి. ఏడాది క్రితం వరకు రూ.500 నుంచి రూ.600 వరకు గల గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.వెయ్యికి చేరువైంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మాసం నుంచి గ్యాస్ ధర పెంచడంతో పాటు సబ్సిడీని కోత పెడుతూ వస్తున్నది.
మెదక్ జిల్లాలో 1,98,358 వంట గ్యాస్ కనెక్షన్లు…
మెదక్ జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 1,98,358 వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం పథకం కింద 13,085, ఉజ్వల పథకం కింద 22,157, సాధారణ కోటలో 1,63,116 కనెక్షన్లు ఉన్నాయి. చిన్న కుటుంబాలు ఏడాదికి 6 నుంచి 7 సిలిండర్ల వరకు వినియోగిస్తున్నాయి. పెద్ద కుటుంబాలు ఏడాదికి 12కి పైగా సిలిండర్లు వినియోగిస్తారు. ముఖ్యంగా వినియోగదారుల్లో 70శాతం మేరకు సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారు. వీరి నెలసరి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఇలా ధర పెంచడంతో ఆయా వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. సిలిండర్ ధర పెరగడంతో జిల్లాలోని వినియోగదారులపై ప్రతినెలా సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదనపు భారం పడుతున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు బడ్జెట్ తలకిందులవుతున్నది.
కేంద్రమే భరించాలి..
ఏడాదిలో పదిసార్లు వంట గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి కుటుంబాలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతున్నది. అన్నిరకాల పన్నులు కేంద్రమే భరించి వినియోగదారులకు చమురు సంస్థలు ఇచ్చే ధరకే వంట గ్యాస్ అందించి ఆదుకోవాలి. కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతున్నది.
గ్యాస్ ధర పెంచడం సరికాదు..
పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. ధరలు పెంచడం అంటే పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే. అన్ని ధరలను తగ్గిస్తామన్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచుతూ ప్రజలను మోసం చేస్తున్నది. మార్కెట్లో ఇప్పటికే పెరిగిన ధరలతో కుటుంబం గడవడం ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం పేదల వైపు ఆలోచించాలి.
కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదు..
కరోనా కష్టకాలంలో పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా కష్టకాలంలో కనికరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్నిధరలు పెంచుతూ భారం మోపుతున్నది. గ్యాస్ ధరలను పెంచడం సరికాదు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.
ఆందోళనలు చేపడతాం..
పెంచిన ధరలు తగ్గించకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతాం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్యాస్ ధరలు 20 సార్లకు పైగా పెంచింది. గ్యాస్ ధర పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకుంటే ఆందోళనలు చేపడతాం.