
ప్లాస్టిక్ నిషేధానికి ప్రణాళికలు
దశల వారీగా నియంత్రణ
పట్టణాల్లో ఆకస్మిక దాడులకు సమాయత్తం
నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు
సృష్టిలోని ప్రతి పదార్థం జనించిన కొంతకాలానికి అంతరించి పోతుందని అందరికీ తెలిసిందే.. ప్లాస్టిక్‌కు మాత్రం ఇది వర్తించదు. కొన్ని వందల ఏండ్లు గడిస్తే కానీ మనం వినియోగించి పారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. వాటిని కాల్చినా విషవాయువులు భూమిపైనే ఉంటాయి. ప్లాస్టిక్ నివారణకు ఇప్పటికే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. తాజాగా పర్యావరణానికి హానికలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై వచ్చే ఏడాది జూలైలోగా నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న ప్రకటించింది. ఈమేరకు ప్లాస్టిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, ఆగస్టు 22: ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో 9 శాతం రీసైక్లింగ్ అవుతుండగా, 12శాతం కాల్చేస్తున్నారు. మిగిలిన 79శాతం భూమి పొరల్లోకి వెళ్తోంది. పర్యావరణానికి హానికరంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై వచ్చే ఏడాది జూలైలోగా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ఈ నెల 13న ప్రకటించింది. 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల కంటే ఎక్కువ పరిమాణంలో గల వాటినే వాడాలని సూచించింది. ప్లాస్టిక్‌ను శాశ్వతంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులతో కలుగుతున్న పర్యావరణ దుష్పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై నుంచి పూర్తి వాడకుండా చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.
మున్సిపాలిటీల్లో చర్యలకు సన్నద్ధం..
మున్సిపాలిటీలు ఇప్పటి నుంచే ప్లాస్టిక్ నిషేధానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజు వందలాది మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఈ చెత్తలో 20శాతం మేరకు ప్లాస్టిక్ కవర్లు, సంచులు, ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. వాస్తవానికి ప్లాస్టిక్ సంచులు, వస్తువులపై నిషేధానికి ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూన్ 20న జీవో అమల్లోకి వచ్చింది. అప్పట్లో మున్సిపాలిటీలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ర్యాలీలు, అవగాహన ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీల్లోని పారిశుధ్య విభాగాల ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యాపారులకు జరిమానాలు సైతం విధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2016 డిసెంబర్ 30న మళ్లీ జీవో 79 అమలు చేశారు. మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు విక్రయించే హోల్‌సెల్ దుకాణాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా దాడులు లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్రస్తుతం కేంద్రం తాజా ఉత్తర్వులు వెలువరించడంతో మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతకంటే ముందు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మరోమారు అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజా నిబంధనలు
ఇవే..
‘పర్యావరణ పరిరక్షణ చట్టం-1986’లోని ప్లాస్టిక్ వ్యర్థాలపై 2016లో సవరించిన నిబంధనల ఆధారంగా 50 మైక్రాన్ల కంటే తక్కున పరిమాణం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30నుంచి 75 మైక్రాన్లు ఉన్నవాటిని, వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం వాటినే వినియోగించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వ్యాపారులకు నోటీసులిచ్చాం..
పాల్థిన్ కవర్లు వినియోగించవద్దని, విక్రయించవద్దని పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలకు నోటీసులిచ్చాం. అయినా కొంతమంది నిబంధనలు అతిక్రమిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తాం. అలాగే, ప్లాస్టిక్‌ను ఉపయోగించవద్దని ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం.