
మలేరియా, డెంగీ నివారణకు పటిష్ట చర్యలు
మెదక్ జిల్లాలో 12,500 దోమ తెరల పంపిణీ
గ్రామాల్లో ముమ్మరంగా జ్వర సర్వే
మెదక్, ఆగస్టు 22: వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండకుంటే సీజనల్ వ్యాధులతో జేబులు గుళ్ల చేసుకోవాల్సిందే. మనం పీల్చే గాలిలో మనుగడకు మొట్టమొదటి అవసరమైన ప్రాణవాయువే కాక.. ప్రాణాంతక వ్యాధులకు మూలమైన వైరస్లు ఉంటాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గతేడాది జిల్లాలో డెంగీ కేసులు 22, ఈ ఏడాది ఇప్పటి వరకు 7డెంగీ కేసులను గుర్తించారు. అప్రమత్తంగా లేకుంటే ఈ ఏడాది కూ డా పారిశుధ్య లోపంతో డెంగీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో దోమలు, ఈగలు, వైరస్ బ్యాక్టీరియా వ్యాప్తిచెంది సీజనల్ వ్యాధులు ప్రబలే బెడద ఎక్కువ. ప్రజలపై ప్రతాపం చూపుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్, మలేరియా, డెంగీ, డయేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను నిరోధించవచ్చు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పారిశుధ్య నిర్వహణతో రోగాలకు చెక్..
పల్లెల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపడుతుండడంతో దోమలు, ఈగలు ఇండ్లల్లోకి వచ్చే పరిస్థితి లేదు. గతంలో మురుగు కాల్వలు ఆరు నెలలకోసారి కూడా శుభ్రం చేసే వారు కాదు. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి పంచాయతీకి నిధులను విడుదల చేస్తున్నది. ప్రతి పంచాయతీల్లో నాలుగు నుంచి ఐదు మంది పారిశుధ్య కార్మికులను నియమించింది. దీంతో వారు ప్రతిరోజు ఉదయమే గ్రామంలోని మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. కలుషిత నీటిని తాగడం, కలుషిత ఆహారం తినడంతో డయేరియా ప్రజలే అవకాశం ఉంటుంది. వర్షాలకు ఇం టి పరిసరాలు చిత్తడిగా మారి ఈగలు పెరుగుతాయి. ఈగలు మనం తినే ఆహార పదార్థాలపై వాలి కలుషితం చేస్తాయి. దీంతో ఈవ్యాధి వ్యాపిస్తున్నది. ఈ వ్యాధి సోకకుండా పరిసరాల శుభ్రతను పాటించాలి. ఇం ట్లోకి ఈగలు రాకుండా జాలి ఏర్పాటు చేసుకోవాలి.
జ్వర సర్వేతో అప్రమత్తం..
జిల్లాలోని 469 పంచాయతీల్లో జ్వర సర్వే ప్రక్రియ కొనసాగుతున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సర్వే లో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఇంటి యజమానితో సహా అందరితో మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా జ్వరం వచ్చిందా..? ఎలాంటి వైద్యం తీసుకుంటున్నారు..? ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి అం టూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు వైద్యారోగ్యశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. గతంలో దోమలు అత్యధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 12,500 దోమ తెరలను సరఫరా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే చేస్తూ జ్వరపీడితులను గుర్తిస్తున్నారు.
ఆరోగ్య సిబ్బందిని అప్రమ్తతం చేశాం
జిల్లాలో డెంగీ జ్వరాలు, మలేరియాపై ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులకు రాపిడ్, ైస్లెడ్ టెస్టులు చేస్తూ వ్యాధిని నిర్ధారిస్తున్నాం. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు డెంగీ కేసులను మాత్రమే గుర్తించామని, మలేరియా కేసులు లేవు. జ్వరం వస్తే ఆందోళన చెందకుండా వెంటనే పరీక్షలు చేసుకోవాలి.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో, మెదక్
49వేల 106 రక్తపు శ్యాంపిల్స్ సేకరణ
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 49వేల 106 రక్తపు శ్యాంపిల్స్ సేకరించాం. ఇం టింటికీ ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది జ్వరాలపై సర్వే చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో మలేరియా మందులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 12,500 దోమతెరలను పం పిణీ చేశాం. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ జాగ్రత్తలు పాటించాలి.
-కుమారస్వామి, మలేరియా అధికారి, మెదక్ జిల్లా
మెదక్ జిల్లాలో కేసుల నమోదు..
సంవత్సరం డెంగీ మలేరియా చికున్‌గున్యా మెదడువాపు
2019 102 9 22 1
2020 22 2 2 –
2021 7 – – –