
మెదక్ జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 వరకు టీకాలు
మెదక్, ఆగస్టు 16 : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ ప్రారంభమైంది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. నెల రోజుల తర్వాత మళ్లీ జిల్లాలో మొదటి డోస్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో యువతతోపాటు వృద్ధులు సైతం ముందుకొస్తున్నారు. జిల్లాలోని 24 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 150 నుంచి 200 మంది చొప్పున టీకా వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు నేరుగా పీహెచ్‌సీలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునే అవకాశం కల్పించారు.
జిల్లాలో 24 కేంద్రాల్లో…
మెదక్ జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ఒక జిల్లా కేంద్ర దవాఖాన, ఒక ఏరియా దవాఖాన, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొదటి డోస్ వేసుకొని 96 రోజుల నుంచి 114 రోజులు వేచి చూసిన వారికి మాత్రమే రెండో డోస్ ఇస్తున్నారు. ఆదివారం, బుధవారం తప్ప.. మిగతా రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ఇప్పటివరకు 2,27,615 మందికి వ్యాక్సిన్..
జిల్లాలో ఇప్పటివరకు 2,27,615 మంది మొదటి, రెండో డోస్ తీసుకున్నారు. వీరిలో లక్షా 63 వేల 133 మంది మొదటి డోస్ వేసుకోగా, 64,482 మంది రెండో డోస్ వేసుకున్నారు. 45 నుంచి 59 ఏండ్ల వరకు మొదటి డోస్ తీసుకున్న వారు 69,958 మంది, సెకండ్ డోస్ తీసుకున్నవారు 38,420 మంది ఉన్నారు. 60 ఏండ్లు పైబడిన వారు 40,177 మొదటి డోస్ తీసుకోగా, 18,513 మంది రెండో డోస్ తీసుకున్నారు. 18 – 44 ఏండ్ల వరకు 46,576 మంది మొదటి డోస్ తీసుకున్నారు. 3069 మంది రెండో డోస్ తీసుకున్నారు.
టీకా తప్పకుండా వేసుకోవాలి..
జిల్లాలో 18 ఏండ్లు నిండినవారు తప్పకుండా టీకా వేసుకోవాలి. జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆధార్‌కార్డు తీసుకొని కేంద్రానికి వెళ్తే తప్పకుండా టీకా వేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 27 వేల మందికి టీకా ఇచ్చాం. కొవిడ్ టీకాపై అపోహలు పెట్టుకోవద్దు. టీకా తీసుకోవడంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.