
ఉద్యానవన నర్సరీల క్రమబద్ధీకరణ
చట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మెదక్ జిల్లాలో 7 కూరగాయల నర్సరీలు
మెదక్, ఆగస్టు 20: నర్సరీలను చట్ట పరిధిలోకి తీసుకువస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు పర్చేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపట్టింది. గత చట్టానికి సవరణలు చేసి ఉద్యానవన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలోని నర్సరీలన్నీ ఉద్యాన వన శాఖ పరిధిలో చేర్చాల్సిందే. ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా కల్తీ నారు అంటగట్టినా కటకటాలు లెక్కించాల్సిందే.
మెదక్ జిల్లాలో పక్కాగా అమలు..
మెదక్ జిల్లాలో నకిలీ విత్తన మాఫియాను అణచివేసే క్రమంలో ప్రభుత్వం నర్సరీలపై దృష్టి సారించింది. నర్సరీ చట్టా న్ని పక్కాగా అమలు పర్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు నర్సరీలకు రిజిస్ట్రేషన్ (లైసెన్స్) తప్పనిసరిగా చేసింది. జిల్లాలో 7 కూరగాయల నర్సరీలు ఉన్నాయి. మిరప, టమాట, వం కాయ, పచ్చిమిర్చి, క్యాలిఫ్లవర్తోపాటు బంతిపూల మొక్కల నారును పెంచుతున్నారు. జిల్లాలో ఉన్న నర్సరీలకు లైసెన్స్లు లేవు. ఇటీవల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నర్సరీలు నిర్వహిస్తూ లైసెన్స్ తీసుకోవడానికి గడువు విధించారు.
నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాలి..
అనుమతి పొందిన నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారు చేసిన తేదీ, గడువు, విత్తన తేదీ, నారు, మొక్కలు అమ్మిన తేదీ తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు, మొక్కల సంఖ్య ధరల పట్టిన తెలుగులో రాసి ఉంచాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్లను వేరుగా ఉంచాలి. నీటితో పాటు కార్యాలయ స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షెడ్ నెట్ హౌస్, నెట్ హౌస్, పాలీటన్నెల్ తదితరాలు సమకూర్చుకోవడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయస్సు, నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి.
లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి..
ప్రతి నర్సరీదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పండ్ల మొక్కల నర్సరీకి మూడేండ్లకోసారి, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధం, అలంకరణ మొక్కలకు సంవత్సరానికో సారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. నాలుగు లక్షలు లేదా అం తకన్నా తక్కువ మొక్కల ఉత్పత్తికి రూ.500, నాలుగు లక్షల కన్న ఎక్కువ మొక్కల ఉత్పత్తికి రూ.1000, పండ్ల మొక్కల నర్సరీకి రూ.1500 ఫీజు చెల్లించాలి.
నర్సరీ చట్టం ఇలా..
పండ్లు, పూలు, కూరగాయల నర్సరీలు ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా ఉంటాయి. ఉద్యాన నర్సరీ చట్టం-2017 ప్రకారం నర్సరీల్లో పెంచే మొక్కలు నాణ్యతా ప్రమాణాలతో ఉండా లి. మొక్కల పరిమాణం, ప్రమాణాలను బట్టి ధరలు ఉం డాలి. షేడ్నెట్లో ఆరోగ్యకరమైన నారును పెంచడం, మొ క్కలు తీసుకున్న రైతుకు బిల్లు ఇవ్వడం, నర్సరీల్లో వినియోగించే విత్తనాలు ఏ కంపెనీకి చెందినవో రికార్డుల్లో నమోదు చేయాలి. 2018 నర్సరీ ఏర్పాటుకు సొంత భూమి లేని వారు లీజుకు తీసుకొని ఏర్పాటు చేసేలా చట్టంలో మార్పు చేశారు.
ప్రతి నర్సరీకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
నర్సరీ చట్టం ప్రకారం ప్రతి నర్సరీకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నర్సరీలో మొక్కలు పెంచే రైతులు ఉద్యానవన శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి నర్సరీదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లైసెన్స్ రెన్యువల్ తప్పకుండా చేసుకోవాలి. నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాలి.
-నర్సయ్య, ఉద్యానవన శాఖ అధికారి, మెదక్