
కాళేశ్వరం జలాలతో మండుటెండల్లో గలగలలు
2,900 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా వాగుపై ప్రాజెక్టు నిర్మాణం
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో17 కిలోమీటర్ల మేర ప్రవాహం
వాగు పరీవాహకం, బోరుబావుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు
పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీరు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని హల్దీవాగు జీవనదిగా మారనున్నది. భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్టుతో పాటు చెక్‌డ్యాంలు నిండి కిందకు ప్రవహించేది. వానలు లేకపోతే, ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు, వాగు ఎండి ఎడారిగా మారేది. కొండపొచమ్మసాగర్ ద్వారా గోదావరి జలాలను హల్దీవాగుకు తరలించడంతో మండుటెండలోనూ సుమారు నెల రోజుల పాటు పొంగి ప్రవహించింది. 2,900 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా వాగుపై ప్రాజెక్టు నిర్మించగా, ఉమ్మడి వెల్దుర్తి మండలంలో 17 కిలోమీటర్ల మేర ప్రవాహం ఉంది వాగు పరీవాహకం, బోరుబావుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నది. పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీటి గోస తీరింది.
వెల్దుర్తి, ఆగస్టు 19 : ఉమ్మడి వెల్దుర్తి మండల వరప్రదాయినిగా విరాజిల్లుతున్న హల్దీవాగు జీవనదిగా మారనున్నది. మండుటెండల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాలను హల్దీవాగుకు తరలించారు. దీంతో నెలరోజుల పాటు హల్దీప్రాజెక్టుతో పాటు చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి. ఉమ్మడి వెల్దుర్తి మండల ప్రజలు ఆనందానికి అవధుల్లేవు. ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని చాలా గ్రామాల్లో ఎక్కువ భాగం భూములు బీడులుగా దర్శమిచ్చేవి. సాగునీటికి నానాఅవస్థలు పడుతూ రైతులు పంటల సాగుకు దూరంగా ఉండేవారు. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో 1979లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హల్దీప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టును మండలంలోని హక్కీంపేట, కొప్పులపల్లి గ్రామాల శివారులో హల్దీవాగుపై రూ.1.55కోట్లతో 2,900 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా హల్దీప్రాజెక్టు పను లు ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిధుల మంజూరు జాప్యంతో పనులు నత్తనడకన సాగాయి. 1985లో ప్రధాన ఆయకట్ట పనులు పూర్తయ్యాయి. అనంతరం ప్రా జెక్టు ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీటిని అందించడానికి రెండువైపులా కుడి, ఎడమ కాల్వ ల నిర్మాణం చేపట్టారు. ప్రధాన ఆయకట్ట, కాల్వల నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు అధికారుల అంచనా.
తీరిన సాగు, తాగునీటి కష్టాలు..
వర్గల్ మండలం నాచారం వద్ద ప్రారంభమయ్యే హల్దీవాగు మాసాయిపేట మండల సరిహద్దు గ్రామమైన స్టేషన్ మాసాయిపేట వద్ద ప్రవేశిస్తుంది. వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి గ్రామ శివారు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. స్టేషన్ మాసాయిపేట, మాసాయిపేట, బొ మ్మారం, నాగ్సాన్పల్లి, కొప్పులపల్లి, హక్కీంపేట, అచ్చంపేట, హస్తాల్పూర్, నెల్లూర్, ఉప్పులింగాపూర్, రామాయిపల్లి, బండపోసాన్‌పల్లి, కుకునూర్, దామరంచ, శెట్టిపల్లి గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నది. వాగు పరీవాహక ప్రాంతంలో వేలా ది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. వాగు ప్రవహించినప్పుడు నీరు అధికంగా దిగువకు వెళ్లిపోతుండడంతో త్వరగా వాగు ఎండిపోయేది. దీనిని అరికట్టడం కోసం మాసాయిపేట, కొప్పులపల్లి, వెల్దుర్తిలో 2, ఉప్పులింగాపూర్, కుకునూర్, దామరంచ వద్ద 2 చెక్‌డ్యాంలు నిర్మించారు. దీంతో భూ గర్భ జలాలు గణనీయంగా పెరగడంతో రైతులు పంటలను సాగుచేస్తున్నారు.
జీవనదిగా హల్దీ
వానకాలంలో హల్దీ ప్రాజెక్టుతోపాటు చెక్‌డ్యాంలు నిండి నీరు కిందకు ప్రవహించేది. వర్షాలు సరిగ్గా కురవకపోతే ప్రాజెక్టుతోపాటు చెక్‌డ్యాంలు, వాగు ఎండిపోయి ఎడారిగా మారేది. గోదావరి నీటిని ఒడిసిపట్టి బీడుభూములకు మళ్లించాలన్న సీఎం కేసీఆర్ కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌కు హల్దీవాగును అనుసంధానం చేశారు. కొండపోచమ్మ కాల్వ ద్వారా గోదావరి జలాలు హల్దీవాగులో ప్రవహించడంతో గతేడాది ఎండాకాలంలో హల్దీప్రాజెక్టు పూర్తిగా నిండింది. కిందకు ప్రవహించడంతో ఎనిమిది చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకాయి. ఎండాకాలంలో ప్రాజెక్టులో సైతం నీళ్లను చూడని ప్రజలు ఈ ఏడాది ఎండల్లో ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకడంతో సంతోషం వ్యక్తం చేశారు.
కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు
ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వెల్దుర్తి మండలంలోని హక్కీంపేట, అచ్చంపేట, చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి, సూరారం, భాగీర్థిపల్లి, జంగరాయిల మీదుగా వెళ్తుంది. మండలంలోని ఉప్పులింగాపూర్, ఏదులపల్లి, బండపోసాన్‌పల్లి వరకు 6.5 కిలోమీటర్ల పొడవు, ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా కొప్పులపల్లి, హస్తాల్పూర్, నెల్లూర్, పెద్దాపూర్, శేరీల, వెల్దుర్తి, ఎలుకపల్లి, బస్వాపూర్‌ల మీదుగా కుకునూర్ వరకు 8 కిలోమీటర్ల పొడవు కాల్వలు తవ్వారు. కాల్వలు సరిగ్గా తవ్వక పోవ డం, ఎత్తువంపులు ఉండడం, ఎక్కువ భాగం కూ రుకుపోయింది. ఏనాడూ 500 ఎకరాలకు మించి పారలేదు. సమైఖ్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ సర్కారు కాల్వల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసిన నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో నిధులు మంజూరు చేయడంతో కొంతమేరకు కాల్వల పునరుద్ధరణ చేశారు.