
కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం
పల్లెలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసం
మెదక్ రూరల్, ఆగస్టు 19: మహ్మద్ ప్రవక్త మనువడు హుస్సేన్ త్యాగానికి చిహ్నం.. మొహర్రం.. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. ఈ నెలలోనే పదో రోజు హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా ప్రతిమలను ఊరేగించి, తమ సంతాపాన్ని ప్రకటిస్తారు. పది రోజుల పాటు చేసే ఈ పండుగ ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. దీన్నే పీరీల పండుగ అని కూడా అంటారు. మొహర్రం నెల పదో రోజున పీరీలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. వాస్తవానికి మొహర్రం అనేది పండుగ కాదు.
శాంతియుత సమాజ స్థాపన కోసం..
మహ్మద్ ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు నిర్వహించుకునేదే మొహర్రం. శాంతియుత సమసమాజ స్థాపన కోసం కర్బలా మైదానంలో హుస్సేన్ ప్రాణ త్యాగం చేశారని చరిత్ర చెబుతున్నది. పవిత్ర పోరులో అమరులైన ఇమాం హుస్సేన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ 10రోజుల పాటు నివాళి అర్పిస్తారు. మొహర్రం కులమతాలకతీతంగా హిందూ, ముస్లింలు జరుపుకుంటారు. పది రోజుల పాటు పూజలందుకున్న పీరీలను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. ఈ వేడుకల సందర్భంగా షియా ముస్లింలు కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాలను గాయపర్చుకొని రక్తం చిందించి నివాళి అర్పిస్తారు.
వెల్లివిరుస్తున్న మతసామరస్యం ..
మొహర్రం పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కుల మతాలకతీతంగా ఏటా హిందూ, ముస్లింలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. హుస్సేన్ పేరిట గ్రామాల్లో కొలువుదీరే సవార్లులను(పీరీలు) భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పీర్ల వద్ద కోరుకున్న మొక్కులు తీరుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. పీర్లను నమ్మేవారు మొహ ర్రం నెలవంక కనిపించిన నాటి నుంచి నిమజ్జనం జరిగే వరకు మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు. పీర్ల వద్ద అగ్నిగుండం(అలావా) ఏర్పాటు చేసి, దాని చుట్టూ కాళ్లకు గజ్జె కట్టుకొని, డప్పుచప్పుళ్ల మధ్య లయబద్ధకంగా అసైదులా ఆడుతారు. నిప్పు కణికలపై పీరీలు పట్టుకొని నడవడాన్ని మహాత్యంగా భావిస్తారు. ఆఖరు రోజు కర్బలా ఊరేగిస్తారు. పీరీల నిమజ్ఞనంలో వేలమంది పాల్గొని పీరీలకు అల్విదా పలుకుతారు. ఇదే రోజున ముస్లింలు షహాదత్ అంటారు.