
మెదక్, ఆగస్టు 15 : తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, తెలంగాణ వచ్చాక మెదక్ జిల్లాలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆదివారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితమే మనం ఈనాడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని, వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అణగారిన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుపరుస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకానికి తెలంగాణ శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని అన్నారు. ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేస్తామన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గతంలో రూ.25వేలలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, రేపటి నుంచి రూ.50వేలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, దశలవారీగా రూ.లక్ష లోపు రుణ మాఫీ చేయనున్నామని మంత్రి తలసాని తెలిపారు.
జిల్లాలో అర్హులైన 3,368 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశామని, వారికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 1,04,105 మందికి ప్రతినెలా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని, 57ఏండ్లు నిండిన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి తలసాని తెలిపారు. అర్హులు నెలాఖరులోగా మీ సేవ, ఈ సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. గొల్లకురుమ యాదవుల అభివృద్ధికి రెండో విడతగా మెదక్ జిల్లాలో 7,810 మంది లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.1.75 లక్షల విలువైన గొర్రెలను 75 శాతం సబ్సిడీపై అందజేయనున్నామన్నారు.
హరితహారం కింద మెదక్ జిల్లాలో 31 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి తలసాని తెలిపారు. యాసంగిలో 88,206 మంది రైతుల నుంచి 4,42,234.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.835 కోట్లు చెల్లించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచామన్నారు. ఈ వానకాలంలో రైతుబంధు కింద 2.35 లక్షల మంది రైతులకు రూ.197.74 కోట్లు అందించామని తెలిపారు.
రైతులకు సాగు నీరందించేందుకు మిషన్ కాకతీయ కింద ఘనపూర్ ఆనకట్ట పెంచుటకు రూ.43.64 కోట్లతో పనులు చేపట్టామని, పనులు ప్రగతిలో ఉన్నాయని, తద్వారా వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని మంత్రి తలసాని అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జిల్లాలోని 1,211 చెరువుల్లో రూ.2.52 కోట్ల విలువైన 34.15 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. తద్వారా 8,500 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశముందన్నారు.
జిల్లాలో స్త్రీనిధి బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాలకు ఇప్పటి వరకు రూ.8.50కోట్ల రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా 1,786 సంఘాలకు రూ.70.62 కోట్ల రుణాలు అందించినట్లు మంత్రి తలసాని తెలిపారు. గతేడాది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 5,584 మంది లబ్ధిదారులకు రూ.లక్షా 116 చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు.
ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా 219 మంది లబ్ధిదారులు స్వయం ఉపాధి పథకాల స్థాపనకు రూ.8.54 కోట్లు అందించనున్నామని మంత్రి అన్నారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 101 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన 17,794 మంది లబ్ధిదారులకు రూ.10.25 లక్షలు అందించామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకాడే, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.