
దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వివరాలు సేకరించాలి
బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరీశ్
మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 13: వాన కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయుటకు రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ హరీశ్ ఎంపీడీవోలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో దళితవాడలు, గిరిజన నివాస ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించుటకు వివరాలు సేకరించి వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖధికారులు సమన్వయంతో అటవీశాఖ స్థలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు బీమా కల్పించుటకు ప్రీమియం డబ్బులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాల్లో జాప్యం జరిగితే బాధ్యులు సర్పంచులు, కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులే అని కలెక్టర్ హెచ్చరించారు. ధరణి సంబంధించి ఉదయం 10.20 గంటల వరకు లాగిన్ కావాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన నిరుపేద కుటుంబాలకు ఆపద్బంధువు పథకం ఆర్థికంగా సహాయ పడుతున్నదని, ఇటువంటి విషయంలో జాప్యం చేయకుండా వెంట నే అందించాలన్నారు. జిల్లాలో 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రతిపాదనలు పంపిన వెంటనే మంజూరు ఇస్తామని కలెక్టర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, మెదక్ ఆర్డీవో సాయిరాం, డీఎల్పీవోలు, తహసీల్దార్లు, ఏంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.