
మెదక్, సెప్టెంబర్ 12 : మెదక్ పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యుడు ఆర్. చంద్రశేఖర్ కూకట్‌పల్లిలోని సితార గ్రాండ్ హోటల్లో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణంలోని ఆజంపురలో అనురాధ నర్సింగ్ హోంను డాక్టర్ అనురాధ-చంద్రశేఖర్ దంపతుల 20 ఏండ్లుగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించిన చంద్రశేఖర్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. అయితే వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆదివారం నిజాంపేటలో కుమారుడికి నీట్ పరీక్ష రాయించేందుకు భార్యతో కలిసి చంద్రశేఖర్ వచ్చారు. కొడుకును నిజాంపేటలోని కేంద్రం వద్ద వదిలేశారు. ఆ తర్వాత భార్య అనురాధ మెదక్‌లోని దవాఖానలో అత్యవసర ఆపరేషన్ కోసం వెళ్లింది. చంద్రశేఖర్ మాత్రం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని సితార గ్రాండ్ హోటల్లో 314 గదిలో బస చేయడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు నిద్ర మాత్రలతో పాటు తాడు వెంట తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో భార్య అనురాధ పలుమార్లు ఫోన్ చేసినా చంద్రశేఖర్ స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి ఫోన్ చేసింది. హోటల్ సిబ్బంది గదికి వెళ్లి ఎంత ప్రయత్నించినా అతను డోర్ తీయలేదు. దీంతో వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి డోర్ తీసేసరికి చంద్రశేఖర్ ఉరేసుకొని కనిపించాడు. వెంటనే మృతదేహాన్ని శవ పరీక్ష కోసం వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిపై హత్య కేసు ఆరోపణలు
మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. హత్య కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హతుడు, మృతుడి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతుండేవి. శ్రీనివాస్ హత్యతో సంబంధాలున్నాయన్న అనుమానంతో చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు పిలిపించి విచారించారు. చంద్రశేఖర్ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? ఇంకేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.