
నిన్న మొన్నటి దాకా పల్లెవాసులకు అంతగా పరిచయం లేని డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం పల్లెటూర్లలోకి ఇప్పుడిప్పుడే ఎంటరవుతున్నది. ఈ ఫ్రూట్ గురించి, పట్టణవాసులకు మాత్రమే అంతోఇంతో తెలిసు. కానీ, పల్లెవాసులకు ఈ ఫ్రూట్ అంతగా పరిచయం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో అమెరికా, చైనా వంటి దేశాల్లో దొరికె ఈ ఫ్రూట్.. ఇప్పుడు మన పల్లెటూర్లలో కూడా లభ్యమవుతుండడం విశేషం. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒకరిద్దరు చొప్పున ఈ డ్రాగన్ ఫ్రూట్స్‌ను పండిస్తున్నారు. ఇదే కోవలో మద్దూరు మండలంలోని వంగపల్లి గ్రామంలో విశ్రాంత ఉద్యోగి చల్లా కమలాకర్‌రెడ్డి వస్తారు. డ్రాగన్ పంటను సాగు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమలాకర్‌రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీలో 33ఏండ్ల పాటు ఉద్యోగం చేసి, ఇటీవలే వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శగా నిలుస్తున్నారు. అలాగే విభిన్న పంటను సాగు చేయాలనే ఉద్దేశంతో సుమారు ఆరేండ్లు డ్రాగన్ ఫ్రూట్స్‌పై పరిశోధన చేసి, రెండేండ్ల క్రితం నుంచి ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్స్‌ను సాగు చేస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్లో మెండుగా పోషకాలు..
డ్రాగన్ ఫ్రూట్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగు పర్చడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. మిటమిన్ సీ, ఈలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ప్రోబయోటిక్స్ ఉండడంతో పొట్ట, పేగులు, అన్నవాహికను శుభ్రం చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఫ్రూట్లో సహజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. ఇన్ని ఔషధ గుణాలున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ కిలోకు రూ.70నుంచి రూ.100 వరకు ధర పలుకుతుంది.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి..
డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది తక్కువ పెట్టుబడితో రైతుకు ఎక్కువ రాబడి అందుతుంది. ఎకరం విస్తీర్ణంలో రూ.5లక్షల పెట్టుబడితో మొదటి సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్స్ పంటను సాగు చేస్తే, కొద్దిపాటి నిర్వహణతో సుమారు 30ఏండ్ల పాటు రైతుకు లాభాలు పొందే అవకాశముంది. దీనికి నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది.
మన ప్రాంతంలో ఎరుపు లేదా గులాబీ ఉత్తమం..
డ్రాగన్ ఫ్రూట్ సుమారు 15 రకాల రంగుల్లో లభ్యమవుతుంది. అయితే, మన ప్రాంతంలో ఎరుపు లేదా గులాబీ రంగు ఫ్రూట్‌ను సాగు చేయడం ఉత్తమం. ఈ డ్రాగన్ మొక్క అనేది చూడడానికి బ్రహ్మజెముడు, నాగజెముడులా ఉంటాయి. ఎకరం విస్తీర్ణంలో 1600 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క రూ.60 దొరుకుతుంది. డ్రాగన్ మొక్కలను 10/10 వ్యాసార్థంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి, స్తంభానికి నలు వైపులా మొక్కలు నాటాలి. నాటిన మొక్క స్తంభం పైకి వెళ్లేందుకు వీలుగా దారాలు కట్టాలి. స్తంభంపై పాత టైర్లు లేదా సిమెంట్ రింగులను ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత, డ్రాగన్ మొక్క స్తంభం పైకి వెళ్లి టైర్ చుట్టూ పెరిగి, కిందికి వేలాడుతుంది. మొదటి ఏడాది ఒకటి నుంచి రెండు టన్నులు.. ఇలా ప్రతి ఏడాది పంట దిగుబడి పెరుగుతూ ఉంటుంది. టన్నుకు రూ.1.25లక్షల ఆదాయం వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్‌తోనే కాకుండా మొక్కలను అమ్మడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుంది. దీంతో డ్రాగన్ ఫ్రూట్స్ పంట సాగుపై రైతులు ఇప్పుడిప్పుడే ఆసక్తిని కనబర్చుతున్నారు.
ఆరెండ్ల పాటు పరిశోధన చేశా..
డ్రాగన్ ఫ్రూట్ అమెరికా, చైనా, థాయిలాండ్ వంటి దేశాలతో పాటు మన దేశంలోని అరకులోయ ప్రాంతంలో మాత్రమే పండుతది అనే అపోహ ఉండేది. అలాంటి ఈ డ్రాగన్ ఫ్రూట్‌పై సుమారు ఆరేండ్ల పాటు పరిశోధనలు చేశా. సంగారెడ్డిలో డాక్టర్ శ్రీనివాస్‌రావు క్షేత్రంతో పాటు ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి, సాగును పరిశీలించా. అప్పటి నుంచి మనం కూడా ఈ పంటను పండించవచ్చన్న అభిప్రాయానికి వచ్చి, ఎకరం విస్తీర్ణంలో సాగు చేశా. మొదటి ఏడాది ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అందరికి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజలకు వంద రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నా. డ్రాగన్ పంటే కాకుండా మామిడి, జామ, వరి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులనే సాగు చేస్తున్నా. డ్రాగన్ సాగుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రభుత్వం రైతులకు కొంత చేయూతనందిస్తే ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తా.