
మిరుదొడ్డి, ఆగస్టు 12: వానకాలం వచ్చిందంటే చాలు.. పొంగిపొర్లుతున్న వాగులతో భయాందోళన పరిస్థితులు నెలకొనేవి. ఆ సమయంలో వాగులు, వంకలు, చెరువు మత్తల్లను దాటి ప్రయాణం చేయడం ఓ సాహసమే. పట్టు తప్పితే ప్రమాదాల బారిన పడాల్సి వచ్చేది. వానకాలం సీజన్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా నిర్మించిన హైలెవల్, మినీ బ్రిడ్జిలపై ప్రత్యేక కథనం..
సికింద్రాబాద్ నుంచి గజ్వేల్-మిరుదొడ్డి మీదుగా దుబ్బాక, కామారెడ్డికి, దౌల్తాబాద్ నుంచి అల్వాల్ మీదుగా సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి వానకాలంలో ఇబ్బందులు తలెత్తేవి. వర్షాలు భారీగా కురిస్తే నీటి ప్రవాహం కొనసాగినన్నీ రోజులు రాకపోకలు నిలిచిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో చెప్యాల, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్, భూంపల్లి, అక్బర్పేట మీదుగా సుమారు మరో 15 కిలోమీటర్ల దూరం తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు.
వానకాలంలో మిరుదొడ్డి-లింగుపల్లి గ్రామ శివారుల మధ్య కూడవెళ్లి వాగుపై ఉన్న పురాతన బ్రిడ్జిపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు జంకేవారు. వర్షాలు భారీగా కురిస్తే కూడవెల్లి వాగునీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో ప్రజలకు ప్రయాణం ప్రాణసంకటంగా పరిణమించింది. టీఆర్ఎస్ సర్కారు ఆ ఇబ్బందులను తొలగించేందుకు కంకణం కట్టుకున్నది. వానకాలంలో ఎలాంటి భయాలు లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేలా హైలెవల్, మినీ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
మోతె గ్రామం పక్కనే ఉన్న పెద్ద చెరువు మత్తడి వద్ద చేపట్టిన బ్రిడ్జి, మిరుదొడ్డి గ్రామ శివారులో నాగయ్య వాగుపై మినీ బ్రిడ్జి, మల్లుపల్లి పెద్ద చెరువు మత్తడికయ్య హైలెవల్ బ్రిడ్జి, మిరుదొడ్డి-లింగుపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రూ. 6 కోట్ల 65 లక్షల నిధులతో మిరుదొడ్డి కూడవెల్లి వాగుపై హైలెవల్, మండలంలో మినీ బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించడానికి సిద్ధంగా ఉంది.