
ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10 : రేపటి భావిత భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలకు పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ కార్యక్రమం నిర్వహిస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరానికిగాను కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కస్తూర్బా, గురుకుల పాఠశాలలకు అవకాశం కల్పించారు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రయోగాన్ని రాష్ట్ర స్థాయికి, ఆ తర్వాత జాతీయ స్థాయికి పంపించి ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులు అందజేస్తుంది.
గతేడాది ప్రయోగాల ప్రదర్శన..
2020-21 సంవత్సరానికిగాను ఇన్స్పైర్ మనక్‌కు ఎంపికైన 180 పాఠశాలల నుంచి 550 దరఖాస్తులు రాగా, 120 మంది విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేసిన విషయం విదితమే. వారందరూ ప్రయోగాలను ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా రద్దయింది. వీరికి ఆగస్టు 20న ఆయా ప్రయోగాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ అయిన విద్యార్థులు వాటిని డ్రా చేసుకొని ప్రాజెక్ట్‌లను సంసిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గత నెల జూలై 27న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లతో విద్యాశాఖాధికారులు జూమ్ యాప్‌లో సమావేశంలో ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది..
ఈ ఏడాది 2021-22గాను దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 15 వరకు చివరి తేదీగా ప్రకటించారు. దరఖాస్తు చేసుకునే వారు www.inspireawards. gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసిన ప్రయోగాలను జాతీయ నవకల్పన సంస్థ పరిశీలించి ప్రాజెక్ట్‌లను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన తర్వాత రూ.10వేల నగదు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తుంది. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 352 పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో జడ్పీహెచ్ఎస్ పాఠశాలల 138, ప్రభుత్వ హైస్కూళ్లు 6, కేజీబీవీలు 15, టీఎస్ మోడల్ పాఠశాలలు 7, యూపీఎస్ పాఠశాలలు 130, ప్రైవేట్ పాఠశాలలు 40, గురుకుల పాఠశాలలు 16 ఉన్నా యి. ఈ పాఠశాలల నుంచి సుమారుగా 750 ప్రాజెక్ట్‌లు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
ఇన్స్పైర్ మనక్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. విద్యార్థులు తమ ప్రతిభను ఇలాంటి వేదికలపై నిరూపించుకునేందుకు ఇదో సువర్ణావకాశం. గతేడాది నిర్వహించాల్సిన ఇన్స్పైర్ మనక్ ఆగస్టు 20న నిర్వహిస్తాం. ఎంపికైన విద్యార్థులు సంసిద్ధంగా ఉండాలి. ఇందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలి.
విద్యార్థులకు మంచి అవకాశం..
జిల్లాలోని విద్యార్థులు తప్పనిసరిగా ఇన్స్పైర్ మనక్‌లో పాల్గొని నచ్చిన ప్రాజెక్ట్ ఎంచుకోవాలి. మంచి ప్రాజెక్ట్‌తో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. విద్యార్థులకు ఆయా పాఠశాలల గైడ్ టీచర్లు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఆసక్తి గల విద్యార్థులు ప్రయోగాలపై దృష్టి సారించాలి.