
కారుతో పాటు మృతదేహం కాల్చివేత
అనుమానాస్పద స్థితిలో మెదక్‌కు చెందిన రియల్ వ్యాపారి హత్య
వెల్దుర్తి పరిధిలోని యశ్వంతరావుపేట శివారులో సంఘటన
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వెల్దుర్తి, ఆగస్టు 10 : అనుమానాస్పద స్థితిలో వ్యక్తిని చంపి, కారు డిక్కీలో వేసి, కారుతో పాటు మృదేహాన్ని పెట్రోల్‌తో తగులబెట్టిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావుపేట గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైంది. తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ శ్రీనివాస్(45) తన (TS 15 EH 4005) నంబర్ హోండాసిటీ కారులో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటినుంచి బయలుదేరాడు. సాయత్రం 5 గంటల వరకు శ్రీనివాస్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయలేదు. మంగళవారం ఉదయం తిరుపతికి వెళ్తానని చెప్పిన తన భర్త శ్రీనివాస్ ఫోన్ పనిచేయకపోవడంతో భార్య హైందవి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావుపేట గ్రామ శివారులో వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన కారుతో పాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి శవమై తేలాడు. ఇంజన్ నంబర్ ఆధారంగా హోండాసిటీ కారు మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్‌దిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, చేగుంట ఎస్సై సుభాశ్గౌడ్లు తన సిబ్బందితో మెదక్‌లోని ధర్మకార్ శ్రీనివాస్ ఇంట్లో విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద పెట్టుడు పళ్లు లభించడంతో మృ తుడు శ్రీనివాస్‌గా నిర్ధారణ చేశారు. మృతుడు శ్రీనివాస్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురితో గొడవలు ఉండడంతో పాటు ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆయన భార్య హైందవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాస్‌ను ఎక్కడో హత్యచేసి కారు డిక్కీలో వేసి యశ్వంతరావుపేట శివారులో దగ్ధం చేశారన్నారు. మృతుడి వాహనం, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా జిల్లా పరిధిలోని చిన్నశంకరంపేట, చేగుంట, రెడ్డిపల్లి ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు తిరిగినట్లు గుర్తించామన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయిందన్నారు. హత్యకేసును ఛేదించడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలానికి మెదక్ ప్రభు త్వ దవాఖాన వైద్యులు వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు స్వామిగౌడ్, నాగార్జునగౌడ్, లింగేశ్వరరావు, ఎస్సైలు మహేందర్, రాజుగౌడ్, రాజు, చంద్రశేఖర్ పరిశీలించారు.