
మెదక్, ఆగస్టు 10 : మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ రాంచందర్ కుమారుడు ధర్మకార్(కటికె) శ్రీనివాస్ హత్యకు గురికావడం జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన శ్రీనివాస్ మంగళవారం ఉదయం శవమై తేలడంతో ఆయన కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. పట్టణంలో ధర్మకార్ శ్రీనివాస్ 30 ఏండ్లుగా రాజకీయపరంగా, పట్టణంలో సినీమ్యాక్స్ థియేటర్‌కు యజమానిగా అందరికీ సుపరిచితుడే. తండ్రి రాంచందర్ మృతి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యా పారం చేశాడు. గతంలో బీజేపీ నాయకుడిగా పనిచేశాడు. గతంలో రెండుసార్లు జనశక్తి నక్సలైట్లు శ్రీనివాస్‌పై కాల్పులు జరిపారు.
ధర్మకార్ శ్రీనివాస్ సొంత డబ్బులతో మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో రోగులకు రూ.5 భోజనం ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆయన హత్య వార్త తెలియగానే జిల్లాకేంద్రం ఒక్కసారి ఉలిక్కిపడింది. హోండాసిటీ కారు డిక్కీలో ఉన్న మృతదేహం ధర్మకార్ శ్రీనివాస్దా, లేక గుర్తుతెలియని వ్యక్తిదా అనే దానిపై ఉదయం నుంచి పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. సాయంత్రం శ్రీనివాస్ భార్య హైందవి తన భర్తకు కృత్రిమపళ్లు ఉన్నాయని, డిక్కీలోని మృతదేహం తన భర్తదేనని చెప్పడంతో హత్యకు గురైంది శ్రీనివాస్ అని నిర్ధారణకు వచ్చారు.
మెదక్ పట్టణానికి చెందిన గుడ్ల వాణి, వీరభద్రయ్య కూతురు హైందవిని ధర్మకార్ శ్రీనివాస్ ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. భర్త హత్యకు గురయ్యాడని విషయం తెలుసుకున్న హైందవి గుండెలు పగిలేలా విలపించింది. దగ్ధమైన కారు తమదేనని, అందులో కాలిపోయిన వ్యక్తి తన భర్త కాకపోవచ్చని చివరి వరకు అనుమానించినా, చివరకు అతని కృత్రిమ పళ్ల ఆధారంగా మృతదేహం తన భర్తదేనని హైందవి పోలీసులకు తెలిపింది. వీరికి ముగ్గురు పిల్లలు భువన్, బ్రహ్మిణి, శ్రీవాత్సవ్ ఉన్నారు. తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఆ చిన్నారులు గుం డెలు పగిగేలా రోదించారు. మెదక్‌లోని శ్రీనివాస్ ఇంటికి ఉద యం నుంచే పెద్దఎత్తున బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరుకొని హత్యపై ఆరాతీశారు. శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం మెదక్ పట్టణంలో జరగనున్నాయి.