
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 9: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీసీ వెల్పేర్ అధికారి జగదీశ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిలతో కలిసి మహిళలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనాలు, రంగులు లేని మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి సహకారం తో మూడు వేల విగ్రహాలను పట్టణ ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కిశోర్, శ్రీనివాస్, సమియొద్దీన్, బట్టి లిత, మెప్మా అధికారిణి సునీత, మెప్మా మహిళలు, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, మున్సిపల్ సిబ్బంది చంద్ర మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకులను పంపిణీ చేసిన సర్పంచ్
మెదక్ రూరల్, సెప్టెంబర్ 9: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సౌజన్యంతో మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో మట్టి వినాయకులను సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ సత్తయ్య ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులతో పాటు టీఆర్ఎస్ నాయకులు జయరాంరెడ్డి, రాములు, రాములు, కృష్ణ, నా గయ్య, వెంకటేశం టీఆర్ఎస్వీ నాయకుడు నవీన్ పాల్గొన్నారు.
విత్తన గణపతుల అందజేత
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 9: ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అందజేసిన విత్తన గణపతిని లింగ్సాన్‌పల్లి సర్పంచ్ మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, శ్రీకాంత్, కృష ఎస్సై శేఖర్‌రెడ్డికి అందజేశారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు విత్తన గణపతులను అందజేస్తున్నట్లు సర్పంచ్ మహిపాల్‌రెడ్డి తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి : ఎస్పీ చందనదీప్తి
మెదక్, సెప్టెంబర్ 9 : ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల నిర్వాహకులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ మత పెద్దలకు సలహాలు, సూచనలు చేశామన్నారు. వినాయక ప్రతిష్ఠ నుంచి నిజమ్జనం పూర్తయ్యేంత వరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాల వారు కలిసి పండుగ జరుపుకోవడం జిల్లాలో గొప్ప ఆచారమని తెలిపారు. పోలీసుల సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. వినాయకుని ప్రతిష్ఠించాలనుకునే వారు వెబ్సైట్లో http:/ /policeportal.tspolice.gov.in. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.