
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, సెప్టెంబర్ 8: మత్య్సకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ మండలం కోంటూరు చెరువులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను ఆమె వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకం ప్రవేశపెట్టి చెరువులను బాగుచేసి మత్స్యకారులకు ఉపాధి చూపుతున్నారన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను ప్రభుత్వం అందించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీవాగులోకి నీరు చేరి నిజాంసాగర్ వరకు వెళ్తున్నాయని, సింగూరు నుంచి నీటిని విడుదల చేశారని, ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతున్నదని తెలిపారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా చెరువులు నిండాయని, మరో 25శాతం చెరువులు అలుగులు పారుతున్నాయని తెలిపారు. కోంటూరు చెరువులో లక్ష చేప పిల్లలను వదిలామని, అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదులుతామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడీ మల్లేశం, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు.