
రెండో రోజూ నీళ్లలో వనదుర్గా ఆలయం
సింగూరు నుంచి పోటెత్తుతున్న వరద ప్రవాహం
ఏడుపాయలలో పెరిగిన పర్యాటకుల తాకిడి
సింగూరు, మంజీర నుంచి కొనసాగిన నీటి విడుదల
పాపన్నపేట, సెప్టెంబర్ 8 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వనదుర్గాభవానీమాత ఆలయం రెండోరోజూ బుధవారం సైతం జలదిగ్బంధంలోనే ఉంది. సిం గూరు ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి వనదుర్గాప్రాజెక్టుకు నీటిని వదిరారు. దీంతో ప్రాజెక్టు పొంగిపొర్లి వనదుర్గామాత ఆలయం ముందు నుంచి నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నది. ఆలయం జలదిగ్బంధంలో ఉండడంతో ఆలయ ఈవో సార శ్రీనివాస్ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు రాజగోపురంలోనే అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం నీటిమట్టం మరింత పెరిగింది. భారీ వరదలతో మెదక్ జిల్లాలోని వనదుర్గాభవానీమాత ఆలయం రెండో రోజూ బుధవారం జలదిగ్బంధంలోనే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు నుంచి వరద నిజాంసాగర్ వైపు పోటెత్తుతుండడంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో నిలిపి పూజలు చేస్తుండగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం ఎదుట ఉన్న బ్రిడ్జి వద్ద నీటిమట్టం మరింత పెరగడంతో పర్యాటకుల సందడి నెలకొంది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతుండగా, ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి. సింగూరు, మంజీర పరీవాహకంలో వరదకు పంటలు నీట మునిగాయి.
పొంగిన మంజీరా నిజాంసాగర్ వైపు పరుగులు
కొల్చారం, సెప్టెంబర్ 8 : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. సింగూరు నుంచి నీరు వదలడంతో బుధవారం మంజీరానది వనదుర్గా(ఘనపూర్) ప్రాజెక్టు వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ప్రాజెక్టుపై నుంచి మూడు ఫీట్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో మంజీరా పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నది. వనదుర్గా(ఘనపూర్) ప్రాజెక్టును నీటిపారుదల ఈఈ ఏసయ్య బుధవారం సందర్శించారు.
చిలిపిచెడ్, సెప్టెంబర్ 8 : వర్షాలతో పాటు నక్క వాగు, సింగూరు నుంచి వస్తున్న భారీ వరదకు మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో మంజీరా నది నిండుగా ప్రవహిస్తున్నది. కుంటలు, చెరువులు నిండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నదిలో నీరు రావడంతో సమీప బోరుబావుల నుంచి నీరు ఉబికి వస్తున్నది.
పొంగిపొర్లుతున్న హల్దీ ప్రాజెక్టు
వెల్దుర్తి, సెప్టెంబర్ 8 : ఉమ్మడి వెల్దుర్తి మండల వరప్రదాయిని హల్దీ ప్రాజెక్టు కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పొంగిపొర్లుతున్నది. మాసాయిపేట మండలంలో హక్కీంపేట-కొప్పులపల్లి గ్రామాల మధ్యన హల్దీవాగుపై నిర్మించిన హల్దీప్రాజెక్టు గతంలో కురిసిన వర్షాలకు నిండుకుండలా ఉండగా, నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పొంగిపొర్లి కిందకు ప్రవహిస్తున్నది. దీంతో ఉమ్మడి వెల్దుర్తి మండలంలో హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాంలు మత్తడి దూకుతూ నీళ్లు మంజీరా వైపు పరుగులు తీస్తున్నాయి.
‘సింగూరు’కు వరద ఉధృతి
పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 8 : సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లాతో పాటు జంటనగరాల నుంచి పెద్దఎత్తున పర్యటకులు తరలివచ్చి ప్రాజెక్టును సందర్శించారు. నీటి నిల్వ 523.600 మీటర్లు, నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు, ఔట్ ఫ్లో 45696 క్యూసెక్కులు నీరు బయటకు వెళ్తుందని అధికారులు తెలిపారు.