
పుల్కల్ రూరల్, ఆగస్టు 8: రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం సాగునీటిని అందిస్తున్నదని, సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలు ఎండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం సింగూరు కెనాల్ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వారు విడుదల చేశారు. ముందుగా కెనాల్ కాలువ గేట్లు, ఆ తర్వాత లిఫ్ట్ గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి రెండు గేట్ల ద్వారా నీటిని కిందకు వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సాగునీరు లేక ఎకరా పొలంకూడా ఎండిపోకూడదని సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయించారన్నారు. భవిష్యత్‌లో గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్టుకు వస్తాయన్నారు. ప్రాజెక్టులో మిషన్ భగీరథకు 16 టీఎంసీల నీరుపోను, సాగుకు మిగతా నాలుగున్నర టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చన్నారు. చెరువులు నిండిన అనంతరం మిగతా గ్రామాల చెరువులకు నీరు వెళ్లకుండా రైతులు అడ్డుకోవద్దన్నారు. రైతులు అధికారులకు సహకరించాలని వారు కోరారు. ఉమ్మడి మండలాలు పుల్కల్, చౌటకూర్‌లోని 170 చెరువులను నింపి 24వేల ఎకరాలు, అందోల్, అన్నాసాగర్ చెరువులను నింపి 14వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులు ఆర్థికంగా ఎదుగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నీటి పారుదలశాఖ ఈఈ మధుసూదన్‌రెడ్డి, డీఈ నాగరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, ఎంపీడీవో మధులత, టీఆర్ఎస్ ఉమ్మడి మండలాధ్యక్షుడు శివకుమార్, రైతు సమన్వయ సమితి నాయకులు నర్సింహారెడ్డి, సింగూరు సర్పంచ్ రాజాగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.