
రోడ్డు జర్నీ ఆహ్లాదాన్ని పంచనున్నది. ప్రయాణంలో పచ్చదనం మనసును తేలికపర్చనున్నది. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ, అంతర్రాష్ట్ర, జిల్లాలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు వరుసల్లో మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్‌ను చేపడుతున్నది. దీంతో రోడ్లు హరితశోభను సంతరించుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో 200 కిలోమీటర్ల పొడవునా రహదారులకు ఇరువైపులా 1.30 లక్షల మొక్కలు నాటుతున్నారు. ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడనున్నది.
-మెదక్, ఆగస్టు 8
మెదక్, ఆగస్టు 8: ఇటీవల చేపట్టిన ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడడం, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏటా కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో ప్రతి ఇంటి ఆవరణ, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలతో పాటు ప్రధానంగా జాతీయ రహదారులను హరితమయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వరుసల్లో (మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్) 200 కిలోమీటర్ల పొడవున చేపడుతున్నది. ఇందులో భాగంగా లక్షా 30వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
మెదక్ జిల్లాలో ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-765డీ, స్టేట్ హైవేలు ఉన్నాయి. ఇందులో ఎన్‌హెచ్-44లో 51 కిలోమీటర్లు, ఎన్‌హెచ్-765డిలో 31 కిలోమీటర్ల మేర జాతీయ రహదారికి పొడవునా మొక్కలు నాటుతున్నారు. స్టేట్ హైవేలో కూచారం నుంచి దామరచెర్వు వరకు జాతీయ రహదారి వెంట మొక్కలు నాటుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి చేగుంట వరకు 26కిలోమీటర్ల మేర మూడు వరుసల్లో, మంభోజిపల్లి నుంచి బొడ్మట్‌పల్లి వరకు 40 కిలోమీటర్ల మేర మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ జాతీయ రహదారి పొడవునా మొక్కల నాటేందుకు గుంతలు తవ్వారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలను నాటారు.
జిల్లాలోని పలు రహదారుల వెంట మూడు వరుసల్లో మొక్కలు నాటడం పూర్తి కాగా, మరికొన్నిచోట్ల ఒక వరుసలో మొక్కలు నాటారు. ముఖ్యంగా మెదక్-నర్సాపూర్ వరకు ఆరువేల మొక్కలు నాటారు. నర్సాపూర్ టూ అన్నారం వరకు 10వేల మొక్కలు నాటారు. ఎన్‌హెచ్ 44లో 51 కిలోమీటర్లలో 60వేల మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు వివిధ దశల్లో 52వేల మొక్కలు నాటారు. మరో 8వేల మొక్కలు నాటాల్సి ఉంది. మరో 6వేల గుంతలు తీయాల్సి ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు జాతీయ రహదారుల పరిధిలో 31 గ్రామాల్లో ఆర్అండ్బీ రహదారులు, పంచాయతీరాజ్ రహదారుల పరిధిలో రోడ్ల వెంట మొక్కలు నాటనున్నారు.
మెదక్ జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఆహ్లాదకర వాతావరణం కల్పిచేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నాం. (మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్) కింద జిల్లాలో 200 కిలోమీటర్ల మేర 1.30 లక్షల మొక్కలు నాటుతాం. ఇప్పటికే ఆర్అండ్బీ రహదారులు, పంచాయతీరాజ్ రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటాం.
మెదక్ జిల్లాలో రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించారు. మొదటి వరుసలో అందంగా కనబడే గుల్మోర్, టబుబీయా, రోజీయా, స్పాతోడియా, పెల్టోఫారం ఇతర మొక్కలు నాటాలని నిర్ణయించారు. రెండో వరుసలో మధ్యరకం ఎత్తు వృక్షాలు, ఇక మూడో వరుసలో పెద్ద వృక్షాలైన రావి, మర్రి, వేప లాంటి మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డుకు హద్దులు నిర్ణయించిన తర్వాత రోడ్డు మధ్య నుంచి 5.5 మీటర్ల దూరంలో మొదటి వరుస, ఆ తర్వాత మూడు మీటర్లకు రెండో వరుస, మళ్లీ మూడు మీటర్లకు మూడో వరుస మొక్కలు నాటేలా ప్లాన్ చేశారు. మూడు మీటర్ల దూరంతో గుంతలు తీసి మార్కింగ్ ఇచ్చిన వరుసల్లో ఈజీఎస్ ద్వారా మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. ఆర్అండ్బీ పరిధిలోని చేగుంట నుంచి గజ్వేల్‌కు వెళ్లే దారిలో 11 కిలోమీటర్లు, వెల్దుర్తి నుంచి తూప్రాన్ 21 కి.మీ, పోతంశెట్‌పల్లి నుంచి చిట్కుల్ 20 కి.మీ మేర మొక్కలు నాటనున్నారు. పంచాయతీరాజ్ రోడ్ల వెంట అల్లాదుర్గం క్రాస్ రోడ్ నుంచి రేగోడ్ వరకు 13 కిలోమీటర్ల వరకు మొక్కలు నాటనున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారుల వెంట గుంతలు తీస్తున్నారు.