
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో వనదుర్గాభవానీ అమ్మవారి ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం గోకుల్‌షెడ్‌లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు.. పూజలు నిర్వహించిన భక్తులు
పాపన్నపేట, అక్టోబర్ 7: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉద యం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వనదుర్గాభవానీమాతకు పట్టు వస్ర్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో గోకుల్షెడ్కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం గోకుల్‌షెడ్‌లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ఈవో సార శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిలప్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, జడ్పీటీసీ గడీల షర్మిలాశ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రభవన్ అశోక్, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాగ్సాన్పల్లి సర్పంచ్ సం జీవరెడి, టీఆర్ఎస్ నాయకులు బాలాగౌడ్, మల్లేశం, నవీన్, బాబర్పటేల్, సాయిరెడ్డి పాల్గొన్నారు.
మొదటి రోజు శైలపుత్రిగా…
ఏడుపాయల వనదుర్గాభవానీమాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. రెండోరోజు శుక్రవారం విదియను పురస్కరించుకొని మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన..
ఏడుపాయలలో 3.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న షా పింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే శం కుస్థాపన చేశారు. దేవాదాయశాఖ కార్యాలయం పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు.
వర్గల్ విద్యాధరిక్షేత్రంలో..
వర్గల్, అక్టోబర్ 7: వర్గల్ విద్యాధరిక్షేత్రంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు సరస్వతీ అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. నాచగిరి శ్రీపీఠాధిపతి శ్రీమధుసూదనానంద సరస్వతీస్వామి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీయాయవరం చద్రేఖరశర్మ సిద్ధాంతి దంపతులు అంకుర్పాణ పూజలో పాల్గొన్నారు. ఉత్సవాలలో తొలిరోజు సరస్వతీమాత బాలాత్రిపురసుందరీగా భక్తులకు దర్శనమిచ్చారు. నేడు గాయత్రీమాతగా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
బాలాత్రిపురసుందరి దేవిగా భద్రకాళీమాత
గుమ్మడిదల, అక్టోబర్ 7 : గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో గురువారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఆలయకమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌గుప్తా ఆధ్వర్యంలో భద్రకాళీ మాతను బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో పూజలందుకున్నారు. మండలంలోని కానుకుంట గ్రామంలో సప్తమాత్రిక సమేత మహంకాళీ అమ్మవారి ఆలయంలో అర్చకుడు రామశర్మ, దీప్తి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించారు. వీరభద్రనగర్ కాలనీలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలో అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చారు.
శృంగేరీ శంకరమఠంలో పూజలు
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 7 : మండలంలోని కిష్టసాగర్ వద్ద గల శృంగేరీ శంకరమఠంలోని శారద చంద్రమౌళీశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారద అమ్మవారికి విశేష పూజలు, కుం కుమార్చనలు, అభిషేకం నిర్వహించారు. ప్రతిపద, కలశస్థాపన, అఖండ దీప స్థాపన లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు మంగళగౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు కిషన్‌సింగ్ ఠాగూర్, అర్చకులు రాకేశ్‌శర్మ, సన్నీశర్మ పాల్గొన్నారు.
రజత కవచ అలంకృత విజయ దుర్గాదేవిగా అమ్మవారు
కొండపాక, అక్టోబర్ 7 : మండలంలోని మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవోపేతంగా ప్రారంభమయ్యా యి. ఉత్సవాల మొదటి రోజు విజయ దుర్గాదేవి రజత కవచ అలంకృత విజయ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. క్షేత్ర వ్యవస్థాపకులు డా.హరినాథశర్మ ఉత్సవాల ప్రారంభానికి అంకురార్పణ చేశారు. గణపతిపూజతో ప్రారంభమైన ఉత్సవాలు గోపూజ, చతుషష్టి పూజ, కలశస్థాపన, కంకణధారణ కార్యక్రమాలు జరిగాయి. మహిళలు కుంకుమపూజ చేశారు. రుత్వికులు నవావరణ హవనం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు రవీందర్, మల్లికార్జున్, తిరుపతిరెడ్డి, మల్లేశం, రాజు పాల్గొన్నారు.