
మెదక్, సెప్టెంబర్ 30 : మహిళలపై దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో మహిళలపై లైంగికదాడులు, వేధింపులు పెరిగాయి. లైంగికదాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు తెచ్చినా వేధింపులు ఆగడం లేదు. ఇటీవల హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన లైంగికదాడి, హత్య ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆపద సమయంలో వెంటనే 100 టోల్‌ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు.. వెబ్సైట్లు…
ఎవరైనా ప్రమాదంలో ఉన్నామని భావిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 100కు కాల్ చేయవచ్చు. కాల్ సెంటర్ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. ఈ నంబర్‌తో తక్షణ సాయం పొందవచ్చు. ఒకవేళ వాహన సమస్య తలెత్తినా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. మెదక్ జిల్లా పోలీస్ పరిధిలో మహిళలు ఎవరైనా షీటీం వాట్సాప్ నంబర్ 9989937571, 6303923823కు లొకేషన్ షేర్ చేయవచ్చని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఇలా వచ్చిన ఫిర్యాదులను షీ టీమ్‌లకు చెందిన పోలీసులు బృందం మఫ్ట్టీలో సంచరిస్తూ నేరస్తులను ఆధారాలతో పట్టుకుంటారు. మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 08452- 223533, 08452- 221667కు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు.
మెదక్ జిల్లాలో రెండు షీ టీం డివిజన్లు..
మెదక్ జిల్లాలో 2 షీ టీమ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో మెదక్, తూప్రాన్ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఈ షీ టీమ్‌ల్లో ప్రత్యేకంగా ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను నియమించారు. షీ టీమ్ నంబర్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి రక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 2వరకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ 5, పెటీ కేసులు15 నమోదు చేశారు.
హ్యాక్ ఐ…
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో కూర్చున్న చోటు నుంచే ఎలాంటి ఫిర్యాదైనా పోలీసులకు చేరేలా హ్యాక్ ఐ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో మన వివరాలు ఎంట్రీ చేసి ఫిర్యాదు చేస్తే జీపీఎస్ లొకేషన్ ద్వారా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుతుంది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు తీసుకుంటారు.
మహిళల రక్షణకే షీ టీమ్‌లు…
మహిళల రక్షణ కోసమే షీ టీమ్‌లు ఏర్పాటు చేశాం. ఏ సమయంలోనైనా.. ఎక్కడైనా మహిళలకు ఆపద వస్తే వెం టనే 100కు కాల్ చేయాలి. జిల్లాలో ఆకతాయిలపై నిఘా పెంచాం. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రిపూట పెట్రోలింగ్, వాహన తనిఖీలు చేపడుతున్నాం. షీటీమ్స్ వాట్సాప్ నంబర్ 63039 23823కు సమాచారం ఇవ్వవచ్చు.
-చందనదీప్తి, మెదక్ ఎస్పీ