
కొల్చారం, అక్టోబర్ 2 : పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లు.. ఇదేదో గోడలపై రాసిన నానుడి అనుకుంటే పొరపాటే. కొల్చారం మండలంలో పలు పాఠశాలల ప్రాంగణాలు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం తెలంగాణకు హరితహారంలో ప్రభుత్వ స్థలాలతోపాటు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించింది. దీంతో మండల వ్యాప్తంగా న్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. దీంతో అన్ని పాఠశాలల ప్రాంగణాలు హరితవనంగా మారాయి.
మండల వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలలు 45 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఏడు విడుతలుగా 5,695 మొ క్కలు నాటారు. వరిగుంతం పాఠశాలలో విద్యార్థులు మొక్కల నాటి సంరక్షిస్తున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్ల తో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వసురాంతండా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, విద్యాకమిటీ కలిసి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాఠశాల ఆవరణ పూర్తిగా పూలమొక్కలు, అశోక మొక్కలతో నిండిపోయింది. సీతారాంతండా పాఠశాల మొక్కల కార్పొరేట్‌ను తలపిస్తున్నది. అంసాన్పల్లి, పోతంశెట్‌పల్లి, అప్పాజిపల్లి, కొంగోడు, కొల్చారం, రం గంపేట, ఎనగండ్ల, కోనాపూర్ పాఠశాలల ప్రాంగణాల్లో రంగు రంగుల ఆకుల మొక్కలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
కొండాపూర్ పోలీస్ స్టేషన్.. హరితవనం
కొండాపూర్, అక్టోబర్ 2 : ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు అంటేనే ప్రజలకు భయంగా ఉండేది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే పెద్ద సాహసంగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పచ్చని చెట్లు, పూల మొక్కలతో ప్రతినిత్యం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతో సాదర స్వాగతం పలుకుతున్నాయి. అధికారులతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఫిర్యాదుదారుడికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్సైలు స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. పచ్చని చెట్లతో పోలీస్ స్టేషన్ కళకళలాడుతున్నది. పోలీస్ స్టేషన్ లోపలి వరకు సీసీరోడ్డు వేయించి స్టేషన్‌కు కొత్త రూపం తీసుకొచ్చారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు ఇక్కడి వాతావరణాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మరిన్ని సేవలు…
ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నది. అదుపునకు నూతన వాహనాలను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌కు సంబంధిచిన స్థలంలో ఎస్సై సంతోష్‌కుమార్, కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి వేల మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచారు. ఎస్సై, సీఐల సూచనల మేరకు మొక్కలు ఎండిపోకుండా కానిస్టేబుల్ మధుసూదన్రాజ్ సంరక్షిస్తున్నాడు. ఆయనతోపాటుగా పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుని వాటిని సంరక్షిస్తున్నారు.
మొక్కలు సంరక్షించే విద్యార్థులకు మార్కులు
మానవాళి మనుగడలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొక్కలు సంరక్షించిన విద్యార్థులకు అదనపు మార్కులు ఇస్తున్నాం. ప్రతి విద్యార్థి మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాల ఆవరణం పచ్చని తోరణాలుగా మారాయి.
-నీలకంఠం, ఎంఈవో, కొల్చారం
విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాం
మొక్కలు నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాం. విద్యార్థులు, ఉపాధ్యాయలు మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకున్నా విద్యా కమిటీ సహకారంతో ఇనుప కంచె వేశాం. పూల మొక్కలు, అశోక మొక్కలను ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసి నాటాం. పాఠశాల ఆవరణలో ఆహ్లాదరక వాతావారణం నెలకొంది.
-చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుడు, వసురాంతండా